సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (10:30 IST)

రఘురామ అబద్దాలకోరు... ఆయనది ఆపిల్ 11 ఐఫోన్... ఫోరెన్సిక్‌లో వుంది : ఏపీ సీఐడీ

వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ సీఐడీ పోలీసు విభాగం మండిపడింది. ఢిల్లీ వేదికగా ఆయన చెబుతున్నవి పచ్చి అబద్ధాలేనని ఆరోపించింది. రఘురామ వాడుతున్నది ఆపిల్ 11 ఐఫోన్ అని అధికారులు వెల్లడించారు. మే 15న ఆయన నుంచి ఫోనును స్వాధీనం చేసుకున్నామని తెలియజేశామన్నారు. 
 
ఆ ఫోనులో ఉన్న నెంబరును ఇద్దరు సాక్షుల ముందు రఘురామ చెప్పగా, ఆ మేరకు స్టేట్మెంట్ కూడా నమోదు చేశామని తెలిపారు. ఆ మేరకు సీఐడీ కోర్టుకు ఫోన్ స్వాధీనంపై సమాచారం అందించామని చెప్పారు.
 
కాగా, తన ఐఫోన్‌ను బలవంతంగా అన్‌లాక్ చేయించారని, తన ఫోన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అయితే, ఫోన్ విషయంలో రఘురామ చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు స్పందించారు.
 
రఘురామ ఇప్పుడు దర్యాప్తు సంస్థలను తప్పుదారి పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని ఏపీ సీఐడీ అధికారులు పేర్కొన్నారు. రఘురామ తన ఫోన్ నెంబరు అంటూ ఢిల్లీ పోలీసులకు ఓ నెంబర్‌ను చెప్పారని, ఆ నెంబరు మీడియాలో కూడా వచ్చిందని, అయితే, విచారణ సందర్భంగా తమకు చెప్పిన ఫోన్ నెంబరు మరొకటి అని వారు స్పష్టం చేశారు. 
 
మే 15న తాము నమోదు చేసిన రఘురామ స్టేట్మెంట్‌కు, ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదుకు తేడా ఉందని సీఐడీ అధికారులు వివరించారు. అలాగే, రఘురామ ఐఫోన్‌ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ విభాగానికి పంపిచామని, ఆయన ఫోన్ డేటాను గత నెల 31న కోర్టుకు కూడా సమర్పించామని సీఐడీ అధికారులు తెలిపారు. 
 
‘మొబైల్‌ ఫోన్‌ అంశంలో రఘురామ తప్పుదారి పట్టిస్తున్నారు. మే 15న రఘురామ మొబైల్‌ (యాపిల్‌ 11) స్వాధీనం చేసుకున్నాం. అందులో ఉన్నది ఫలానా నెంబర్‌ అని రఘురామ చెప్పారు. ఇద్దరు సాక్షుల ముందు రఘురామ స్టేట్మెంట్‌ నమోదు చేశాం. మొబైల్‌ ఫోన్‌ సీజ్‌ చేసిన అంశాన్ని సీఐడీ కోర్టుకు తెలిపాం.
 
రఘురామ యాపిల్‌ ఫోన్‌ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌కు పంపించాం. రఘురామ ఫోన్‌ డాటాను మే 31న కోర్టుకు అందించాం. తన ఫోన్‌ సీజ్‌ చేసినట్టు ఢిల్లీ పోలీసులకు.. రఘురామ ఫిర్యాదు చేసినట్టు మీడియాలో గమనించాం. తన నెంబర్‌ అంటూ ఢిల్లీ పోలీసులకు వేరే ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు. రఘురామ మే 15న మాకు చెప్పినదానికి, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉంది. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా రఘురామ ఫిర్యాదు ఉందని’ అని సీఐడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.
 
ర‌ఘురామ అస‌లు స‌మ‌స్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు కొత్త స‌మ‌స్య‌ల‌ను తెర‌పైకి తెస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందులో భాగ‌మే మొబైల్ ఫోన్ అంశ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదో ర‌కంగా త‌న‌పై న‌మోదైన కేసు గురించి కాకుండా, ఇత‌ర‌త్రా అంశాల‌పై చ‌ర్చ జ‌రిగేందుకే ఇదంతా అని విమ‌ర్శించే వాళ్లు లేక‌పోలేదు. ఏది ఏమైనా ఈ వ్య‌వ‌హారంపై కోర్టులోనే తేల్చుకునేందుకు సీఐడీ సిద్ధ‌మైన‌ట్టు.