శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (11:37 IST)

జగన్ నోట ప్రత్యేక హోదా మాట.. రాష్ట్ర విభజన గాయం మళ్లీ వద్దనే 3 రాజధానులు

Jaganmohan Reddy
74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఏపీలో ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను సీఎం జగన్ ఆవిష్కరించారు.

రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌.. అనంతరం ప్రసంగిస్తూ 'స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి' అని అన్నారు. 
 
ఈ సందర్బంగా సీఎం జగన్ నోట ప్రత్యేక హోదా మాట వచ్చింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా అమలు చేయాలని గట్టిగా అడుగుతూనే ఉంటామన్నారు. కేంద్రానికి ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదని.. కాబట్టి హోదా ఇప్పటికిప్పుడు ఇచ్చే అవకాశం కనిపించడంలేదన్నారు.

భవిష్యత్తులో అయినా పరిస్థితులు మారి, కేంద్రం మనసు మారి ప్రత్యేక హోదా ఇస్తుందని అనుకుంటున్నామని.. అప్పటి వరకూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటామన్నారు. హోదా అంశం మళ్లీ సెంటిమెంట్ అయితే.. తాము ఎప్పటికైనా సాధిస్తామన్నట్లుగా జగన్ చెప్పుకొచ్చారు.
 
రాష్ట్ర విభజన గాయం మళ్లీ మళ్లీ కాకుండా ఉండాలంటే.. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాల్సి ఉందని... వికేంద్రీకరణే సరైన విధానం అని తేల్చి చెప్పారు.

అందుకే సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చామన్నారు. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయరాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తామని స్పష్టం చేశారు. 
 
తమ పాలనలో రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్‌, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెబుతున్నామని జగన్ ప్రకటించారు.

తాము చేపట్టే పథకాలన్నీ ప్రజల్ని పేదరిక నుంచి బయటపడేసేందుకేననన్నారు. అందరికీ ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పేందుకు ప్రయత్నిస్తూంటే.. కొందరు అడ్డుకుంటున్నారని జగన్ వేదికపై నుంచి ఆరోపించారు.