మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (16:17 IST)

విజయసాయి రెడ్డికి షాకిచ్చిన సీఎం జగన్

వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేరుకోలేని షాకిచ్చారు. విశాఖ జిల్లా పార్టీ బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించి, ఆ బాధ్యతలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. అలాగే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లా సమన్వయకర్త బాధ్యతలను కూడా సుబ్బారెడ్డికే సీఎం అప్పగించారు. 
 
ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డిపై ఉత్తరాంధ్రకు చెందిన అనేక మంది సొంత పార్టీ నేతలు అనేక రకాలైన ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న సీఎం జగన్ ఆయన్ను విశాఖ బాధ్యతల నుంచి తప్పించారు. 
 
మరోవైపు, పార్టీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలకు ఏకంగా 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. విజయసాయికి ఒక్క జిల్లా బాధ్యతను కూడా అప్పగించక పోవడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో విజయసాయి ఇకపై విశాఖ నుంచి కాకుండా తాడేపల్లి కేంద్రంగా పని చేయనున్నారు. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డికి జగన్ మరింత ప్రాధాన్యతను కల్పించారు. పార్టీ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించారు.