సోమవారం, 4 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (11:58 IST)

అనుచరులతో బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక భేటీ - ఎమ్మెల్యే పదవికి రిజైన్?

balineni srinivas reddy
రాష్ట్ర మంత్రి పదవి నుంచి తనను తప్పించడంపై వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి గుర్రుగా ఉన్నారు. జగన్‌ తల్లి విజయమ్మ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అత్త వరుస అవుతారు. అయినప్పటికీ ఆయనను జగన్ తన మంత్రివర్గం నుంచి తప్పించారు. 
 
ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ, రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా విధులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే, ఆయన్ను మంత్రిపదవి నుంచి తప్పించి, ఆయన స్థానంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్‌ను మంత్రిగా కొనసాగించారు. దీనిపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సీఎం జగన్‌కు తన నిరసనను తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన తన అనుచరులు, వైకాపా నేతలతో సోమవారం తన నివాసంలో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. తన భవిష్యత్ కార్యాచరణపై ఆయన చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనను మార్కాపురం ఎమ్మెల్యే కొండారెడ్డి, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిలు కలిసి తదుపరి చర్యలపై చర్చినట్టు సమాచారం. 
 
మరోవైపు, ప్రకాశం జిల్లా నుంచి తనను తప్పించి ఆదిమూలపు సురేష్‌ను మంత్రిగా కొనసాగించడాన్ని బాలినేని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి నిరసనగా ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అలాగే, బాలినేనికి మద్దతుగా ఒంగోలు మేయర్, కార్పొరేటర్లు కూడా సమావేశమయ్యారు. అంతేకాకుడా, ఒంగోలు జడ్పీటీసీ చండూచి కోమలేశ్వరి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.