ఐపీఎల్ శాలరీతో అమ్మ కోసం ఇల్లు కొంటా: ఈ వైభవ్ అరోరా ఎవరు?
ఐపీఎల్ అరంగేట్రంలోనే పంజాజ్ యువ పేసర్ వైభవ్ అరోరా అదరగొట్టాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అరోరా.. 21 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.
రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ వంటి స్టార్ ఆటగాళ్లను పెవిలియన్ పంపి పంజాబ్‌కు ఆరోరా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ జట్టు పేసర్ సందీప్ శర్మ స్థానంలో అరోరా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
కాగా పంజాబ్ జట్టు తీసుకున్న నిర్ణయం సరైనది అని అరోరా నిరూపించాడు. అసలీ వైభవ్ అరోరా ఎవరో తెలుసుకుందాం..
వైభవ్ అరోరా డిసెంబర్ 14, 1997న అంబాలాలో జన్మించాడు. అరోరా దేశీయ స్థాయిలో హిమాచల్ ప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. 2019లో సౌరాష్ట్రపై ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. టీ20ల్లో 2021లో ఛత్తీస్‌గఢ్‌పై అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 12 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆరోరా 12 వికెట్లు పడగొట్టాడు.
2020 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ నెట్‌బౌలర్‌గా అరోరాను ఎంపిక చేసింది. 2021లో వైభవ్ అరోరా కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగంగా ఉన్నాడు. కానీ అతనికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.
ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆరోరాని రూ. 2 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఈ అరంగేట్రంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు వైభవ్ అరోరా.
ఇకపోతే.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే రికార్డులు కొల్లగొట్టిన వైభవ్ అరోరా మాట్లాడుతూ.. తన ఐపీఎల్ శాలరీతో అమ్మకు ఇల్లు కొని పెట్టాలని చెప్పాడు. ఇంకా వైభవ్ మాట్లాడుతూ.. " ఇక నా తండ్రి చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయన కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. నేను ఆయనను పని చేయడం మానేయమని చెప్పాను. ఐపిఎల్ నుండి నేను పొందే డబ్బుతో వారికి సహాయం చేయాలనుకుంటున్నాను. అలాగే, నేను నా తల్లికి ఒక ఇంటిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను, అక్కడ ఆమె సౌకర్యవంతంగా జీవించగలదు" అని వైభవ్ చెప్పుకొచ్చాడు.