నేటి నుంచి సీఎం జగన్ 2 రోజుల ఢిల్లీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నుంచి రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మరికొందరు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశంకానున్నారు.
సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో, రాత్రికి హోం మంత్రి అమిత్ షాలతో ఆయన సమావేశమవుతారు. వారిద్దరి అపాయింట్మెంట్లు ఇప్పటికే ఖరారయ్యాయి.
ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, మూడు రాజధానుల ఆవశ్యకత, వీటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రధానికి, హోం మంత్రికి జగన్ వివరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలవరం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు, విభజన చట్టం ప్రకారం అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను ప్రధానితో చర్చిస్తారని తెలుస్తుంది.
అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోవడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏపీ సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదని, త్వరలోనే ఏపీలో శ్రీలంక పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశం కూడా ప్రధాని మోడీ, సీఎం జగన్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.