ఏపీలో వింత.. ఒక వీధికి 2 జిల్లా, 2 మండలాలు, 2 అసెంబ్లీ స్థానాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని విపక్ష నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ప్రజల మనోభావాలకు ఏమాత్రం విలువ నివ్వకుండా ఈ జిల్లాల విభజన జరిగిందంటూ విమర్శలు వెల్లువెత్తినా ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా 13 జిల్లాలను ఇపుడు 26 జిల్లాలుగా చేశారు. అయితే, ఈ జిల్లాల ఏర్పాటుతో వింతలు, విశేషలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ కొత్త జిల్లాల సరిహద్దులు, పాలన సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఒక వీధికి ఇపుడు రెండు నియోజకవర్గాలు, రెండు మండలాలు, రెండు జిల్లాలు సరిహద్దులుగా మారింది. జిల్లాల పునర్విభజన కారణంగా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్ళపూడి మండలంలోని తాళ్ళపూడి, పోలవరం నియోజకవర్గంలోని గూటాల పంచాయతీ పరిధిలోని మహాలక్ష్మిదేవిపేట గ్రామాలు వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్ళిపోయాయి.
ఇందులో తాడిపూడిలోని ఓ వీధి కుడివైపు భాగం తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లగా, ఎడమవైపున ఉన్న మహాలక్ష్మిదేవిపేట ఏలూరు జిల్లాలోకి వెళ్లింది. ఫలితంగా ఒకే వీధి ప్రజలు రెండు వేర్వేరు జిల్లాలు, వేర్వేరు మండలాలు, వేర్వేరు నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్టు అయింది. జిల్లాల అశాస్త్రీయ విభజనకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే.