గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

జాతీయ క్రీడల వేదికగా.. కడపను తీర్చి దిద్దుతాం : అంజాద్ బాషా

వైఎస్ఆర్ కడప జిల్లాను జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ క్రీడా మైదానం ఆవరణలోని జిల్లా హాకీ బోర్డు ఆధ్వర్యంలో జూనియర్, సీనియర్, సబ్ జూనియర్ జిల్లా స్థాయి హాకీ క్రీడాకారుల ఎంపిక పోటీలను.. శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా,కడప పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ మేయర్ కె.సురేష్ బాబుతో కలసి ప్రారంభించారు. 
 
కార్యక్రమంలో ముందుగా అన్ని రాష్ట్రాల క్రీడాకారులు అందించిన గౌరవ వందనాన్ని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా స్వీకరించి.. ముందుగా క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ..  జిల్లా క్రీడాకారులు ఆయా క్రీడలో నైపుణ్యాన్ని పెంచుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నారు. క్రీడాకారులు ఉన్నత ఆశయంతో పోటీల్లో పాల్గొని విజయం సాధించాలన్నారు. 
 
ఈ రోజు జిల్లా హాకీ అకాడమీ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. కడప జిల్లా క్రీడా రంగంలో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా.. జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపును పొందుతున్నందుకు గర్వాంగా ఉందన్నారు. జిల్లా స్పోర్ట్స్ ఆకడమీకి అవసరమైన అన్ని వసతులను సమకూర్చేందుకు శాప్ ఎండి నుండి అనుమతులు కోరామన్నారు. స్పోర్ట్స్ అకాడమీ అభివృద్ధికి రూ. 10 కోట్లు వ్యయంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
 
ప్రత్యేకించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తూ.. కడప జిల్లాలో క్రీడారంగానికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను సమకూర్చుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జిల్లా క్రీడా సంస్థను నాణ్యతా ప్రమాణాలతో క్రీడల జోన్ గా తీర్చిదిద్దుతామన్నారు.
 
అంతే కాకుండా కడప జిల్లా స్పోర్ట్స్ అకాడమీని జాతీయ, అంతర్జాజీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దేoదుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. అందులో భాగంగానే.. జిల్లాలో ఉన్నత ప్రమాణాలతో స్పోర్ట్స్ స్కూల్, అధునాతన సౌకర్యాలతో వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, స్కెటింగ్ కోర్టు నిర్వహణలో ఉన్నాయన్నారు. జిల్లాలో మెరుగైన మౌలిక సదుపాయాలతో క్రీడా ప్రాంగణాలను తీర్చి దిద్ధేందుకు ప్రభుత్వం మరింత శ్రద్ధ వహిస్తోందన్నారు. 
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో క్రీడలపై ఆయనకు ఉన్న మక్కువతో సమైక్యాంధ్ర సమయంలో.. జిల్లాలో స్పోర్ట్స్ స్కూలుకు స్థాపించారని, ప్రస్తుతం నవ్యాంధ్ర  రాష్ట్రంలో.. ఏకైక స్పోర్ట్స్ స్కూల్ కడపలో ఉండడం గర్వించదగ్గ అంశం అన్నారు. రానున్న రోజుల్లో స్పోర్ట్స్ స్కూల్ ను  స్పోర్ట్స్ యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 
 
ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ సంఘం కార్యదర్శి ఎస్ సుభాన్ బాష,జిల్లా హాకీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు , స్టెప్ సీఈవో రామచంద్రా రెడ్డి,31 వ కార్పొరేటర్ అభ్యర్థి అజ్మతుల్లా,30 వ కార్పొరేటర్ అభ్యర్థి షఫీ, 13 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి రామ్ లక్ష్మణ్ రెడ్డి,35వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి   శంషీర్ ,పూసలు  కార్పొరేషన్ అధ్యక్షుడు మనోజ్, వైఎస్సార్ సీపీ నాయకులు దాసరి శివా ,ముసా సేట్,కరిముల్లా ఎల్లారెడ్డి, అహ్మద్ భాషా తదితరులు పాల్గొన్నారు.