1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 జులై 2025 (09:42 IST)

వైకాపా నేతలు సిమెంట్ - పేపర్ వ్యాపారాలు మానేస్తే.. సినిమాలను వదులుకుంటా : పవన్ కళ్యాణ్

pawan kalyan
పాలన గాలికి వదిలివేసి సినిమాలు చేసుకుంటున్నారంటూ వైకాపా నేతలు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. వైకాపా నేతల తరహాలో తనకు వివిధ రకాలైన వ్యాపారాలు లేవన్నారు. అందువల్ల పార్టీని నడపడం కోసం సినిమాలు చేయక తప్పదన్నారు. అయితే, వైకాపా నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా సినిమాలు కూడా పూర్తిగా మాసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీనికి ఓ కండిషన్ అన్నారు. వైకాపా నేతలు కూడా సిమెంట్, పాల, పేపర్ వ్యాపారాలు కూడా మానెయ్యాలని కోరారు. 
 
తాను నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, ఆయన పలు మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, వైకాపా నాయకులకు అబద్ధాలు చెప్పడం, దబాయించడం అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. 'దబాయిస్తే భయపడిపోతారనుకుంటున్నారు. వ్యవస్థలు, వాటిని రక్షించే వ్యక్తులు బతికే ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి' అని పేర్కొన్నారు.
 
పవన్ కల్యాణ్‌కు సినిమాల మీదున్న శ్రద్ధ, పరిపాలనపై లేదన్న వైకాపా నాయకుల విమర్శలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 'వాళ్లు మాత్రం పత్రికలు, టీవీలు, బోలెడు బినామీ కంపెనీలు నడుపుతారు. వ్యాపారాలు చేస్తారు. అనేక ఆదాయమార్గాలు పెట్టుకుంటారు. నేను సినిమాలు మానేయాలా? వాళ్లను సిమెంట్ ఫ్యాక్టరీలు, వ్యాపారాలు మూసేయమనండి. నేను సినిమా షూటింగులు చేయడమే కనిపిస్తుంది తప్ప, వాళ్లు చేసేది కనిపించదు' అని ధ్వజమెత్తారు. 
 
వైకాపా నేతల తరహాలో నాకు ఆస్తులు, స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడులు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలు చేస్తున్నాను. ఈ మూడు సినిమాలు కూడా ఎన్నికల ముందే పూర్తయ్యేవి. కానీ రాజకీయ పరిణామాలు మారిపోవడం వల్ల సమయం కుదరలేదు అని వివరించారు.