1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 జనవరి 2022 (19:20 IST)

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రివర్స్ నడక - కొత్త జీతం వద్దంటూ నినాదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనా కార్యక్రమాలకు దిగారు. గత కొన్ని రోజులుగా వివిధ రకాలైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తున్నప్పటికీ వారు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉద్యోగులు రివర్స్‌గా నడిచి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. 
 
ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చిందంటూ గుంటూరులో ఉద్యోగులు వెనక్కి నడుస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళలో జనవరి నెలకు సంబంధించి తమకు పాత వేతనాలే ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. 
 
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కర్నూలులో ఉద్యోగులు చేపట్టిన ఆందోళనల్లో ఆయన పాల్గొన్నారు. అశుతోష్ మిస్రా కమిటీ 30 శాతం పీఆర్సీ సిఫార్సు చేస్తే 23 శాతమే ప్రకటించడమేమిటని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులకు ఇంత తక్కువ వేతనాలు ఇవ్వడం అన్యాయమని ఆయన ఆరోపించారు. 
 
అదేసమయంలో కొత్త వేతన స్కేల్‌ను ప్రాసెస్ చేయాలని ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం తగదని ఏపీ ఏజేసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన శ్రీకాకుళంలో జరిగిన ఏపీ ఎన్జీవో హోం వద్ద జరిగిన ఉద్యోగుల నిరాహారదీక్షా శిబిరానికి వెళ్లారు.