బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:04 IST)

రేపటి నుంచి ఏపీ ఎంసెట్‌.. కోవిడ్‌ లక్షణాలున్న వారి కోసం ప్రత్యేక గదులు

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీ.ఫార్మసీ తదితర సాంకేతిక వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్‌–2020 ఈ నెల 17 (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో మొత్తం 14 సెషన్లుగా ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్షకు 2,72,900 మంది దరఖాస్తు చేసుకున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకునేలా ఉన్నత విద్యామండలి ద్వారా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఏపీ, హైదరాబాద్‌తో కలుపుకుని 47 పట్టణాల్లో 118 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 17నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్‌ పరీక్షకు 1,85,263 మంది, 23 నుంచి 25 వరకు జరిగే అగ్రి తదితర కోర్సుల ప్రవేశ పరీక్షకు 87,637 మంది హాజరు కానున్నారు.

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండో సెషన్‌ ఉంటుంది. అభ్యర్థులను పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు.అభ్యర్థులు రూట్‌ మ్యాప్‌తో కూడిన ఈ–హాల్‌ టికెట్‌ను, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని నింపి సమర్పించాలి.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం, కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. హాల్‌ టికెట్‌తో పాటు వేరొక అధికారిక ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులను బయటకు అనుమతించరు.

అభ్యర్థులు విధిగా మాస్క్, చేతి గ్లవ్స్‌ ధరించాలి. 50 ఎంఎల్‌ శానిటైజర్, పారదర్శకంగా ఉండే వాటర్‌ బాటిళ్లను లోపలకు అనుమతిస్తారు. కోవిడ్‌ లక్షణాలున్న వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచి పరీక్ష రాయిస్తారు.