గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జులై 2024 (21:16 IST)

ప్రేమ సమాజం భూమల అక్రమాలలో శాంతిపై ఆరోపణలు: దేవాదాయ మంత్రి ఆనం

shanti - anam
విశాఖపట్టణంలోని ప్రేమ సమాజం భూముల అక్రమాల వ్యవహారంలో సస్పెండ్‌కు గురైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిపై ఆరోపణలు ఉన్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్ చేస్తూ, దేవాదాయ శాఖలో శాంతి ఉద్యోగ నియామకంపై ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. అపుడు పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీలోనే ఉన్నారని గుర్తుచేశారు. శాంతి నియామకంపై తప్పు జరిగితే పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా బాధ్యులేనని స్పష్టం చేశారు. దీనిపై ఆధారాలు సేకరించాక ఏపీపీఎస్సీని వివరణ కోరుతామన్నారు. 
 
అలాగే, విశాఖపట్టణంలో పని చేసినపుడు శాంతిపై పలు విమర్శలు వచ్చాయని, ముఖ్యంగా ప్రేమ సమాజం భూముల విషయంలో శాంతిపై ఆరోపణలు ఉన్నాయన్నారు. విశాఖ భూ అక్రమాల్లో శాంతితో పాటు న్యాయవాది సుభాష్ రెడ్డిపై కూడా ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను అసెంబ్లీ ముందు ఉంచుతామని మంత్రి ఆనం తెలిపారు. 
 
అమ్మతోడు.. శాంతి ఇంటికి వస్తే ఆశీర్వదించి పంపాను : సాయిరెడ్డి 
 
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. ఆమె తనకు కుమార్తెతో సమానమని తెలిపారు. తన ఇంటికి వస్తే ఆశీర్వదించి పంపించానని, అంతకుమించి ఏమీ లేదని జగన్‌కు సాయిరెడ్డి తెలిపారు. 
 
ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైకాపా నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఇందులో జగన్, విజయసాయిరెడ్డిల మధ్య అసిస్టెంట్ కమిషనర్ శాంతి అంశంపై పెద్ద చర్చే జరిగింది. అసలేం జరిగింది. ఏమిటీ చర్చ.. మీడియాలో ఎందుకింత రాద్దాం జరుగుతుంది అని సాయిరెడ్డిని జగన్ నిలదీసారు. ఈ మొత్తం వ్యవహారంపై సుమారు అరగంట పాటు వీరిమధ్య చర్చ జరగ్గా.. సాయిరెడ్డి తన వైపు నుంచి వివరణ ఇచ్చారు. 
 
"కొన్ని టీవీ చానళ్లు పనిగట్టుకుని అసత్యాలు ప్రసారం చేస్తున్నాయి. ఆ చానళ్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 2020లో అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఎండోమెంట్స్ విభాగంలో  సీతమ్మదార కార్యాలయంలో కలిశాను. అప్పటి నుంచి ఆమెకు కూతురుగా భావిస్తున్నాను. ఓ తండ్రిగా అడిగినపుడల్లా సాయం చేశాను. శాంతికి కొడుకు పుట్టాడంటే వెళ్లి చూశాను. మాట్లాడాను. నా ఇంటికి వచ్చినపుడు ఆశీర్వదించాను. అంతే.. ఇంతకుమించి ఏమీ లేదు" అని వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణపై జగన్ స్పందన ఏంటన్నది మాత్రం బయటకు రాలేదు. అయితే, విశ్వసనీయ వర్గాల మేరకు.. సాయిరెడ్డికి జగన్ గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం.