1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (20:15 IST)

కేజీబీవీలో 840 మంది ఉపాధ్యాయులకు ఉద్వాసన

kgbv teachers
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూరిభాయ్ గాంధీ బాలికా విద్యాలయాల్లో పని చేస్తే ఉపాధ్యాయుల్లో 840 మంది తాత్కాలిక, గెస్ట్ టీచర్లను తొలగించింది. గత ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న వీరంతా ఉన్నట్టుండి రోడ్డున పడటంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరందరినీ కొత్త నియామకాల పేరుతో తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 
 
అయితే, కాంట్రాక్టు పద్ధతిలో తమనే తీసుకోవాలని పార్ట్ టైం టీచర్లు కోరినా పట్టించుకోవడంలేదు. దీంతో కొత్త నియామకాల్లో తమను సర్దుబాటు చేయాలంటూ గురువారం టీచర్లు ఆందోళన చేశారు. విద్యార్హతలు, బోధనా సామర్థ్యం పరీక్షించాకే తమను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని, ప్రస్తుతం ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చి తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
కేజీబీవీల్లోని ఇంటర్మీడియట్ బోధనకు గతంలో నియమితులైన తెలుగు, ఆంగ్ల ఉపాధ్యాయినులను పోస్టుల సర్దుబాటు పేరుతో ప్రభుత్వం ఇంటికి పంపించింది. కొత్తగా కాంట్రాక్టు పద్ధతిలో 1,543 నియామకాలకు గత నెలలో సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. వందకు వంద మార్కులు వెయిటేజీ అంటూ నోటిఫికేషన్‌లో పేర్కొనడంతో పాటు బోధన సర్వీసుకు ఏడాదికి అర మార్కు చొప్పున వెయిటేజీ ఇచ్చింది. అయితే, ఎనిమిదేళ్లు అదే కేజీబీవీలలో పనిచేసిన పార్ట్ టైం, గెస్ట్ టీచర్లకు 4 మార్కులకు మించి రావడం లేదు.
 
కొత్త నోటిఫికేషన్‌లో భాగంగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున 4,243 మంది జాబితాను ఎస్ఎస్ఏ జిల్లాలకు పంపించింది. ఆయా జిల్లాల్లో గురువారం ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. శుక్ర, శనివారాల్లో డెమో నిర్వహించి, ఆదివారం నియామక పత్రాలు అందించేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే, ఎస్ఎస్ఏ పంపిన జాబితాలో కొంతమంది అభ్యర్థులకు వందకు వంద మార్కులు వచ్చినట్లు చూపడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.