విద్యార్థులను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలి.. మంత్రి బొత్స
విద్యార్థుల తల్లిదండ్రులకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తేరుకోలేని షాకిచ్చారు. రాష్ట్రంలో 98 మందిలోపు పిల్లలున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత బడుల్లోని విద్యార్థులను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలని సుత్తిలేకుండా సూటిగా చెప్పేశారు. ఇది ఆదేశం కాదని, విద్యార్థుల తల్లిదండ్రులకు తన అభ్యర్థన మాత్రమేనన్నారు.
మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను ఇవ్వలేకపోతున్నందున.. విద్యార్థులకు మంచి చదువు వస్తుందనుకున్న బడుల్లో చేర్పించుకోవాలని సూచించారు. ఒకవేళ బడి దూరమవుతుందనుకుంటే కేజీబీవీ, ఎస్సీ, బీసీ, ఇతర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లల్లో చేర్పిస్తే మంచిదని తెలిపారు. పాఠశాల దూరంగా ఉన్నా తల్లిదండ్రులు రోజు తీసుకువెళ్లి, తీసుకువస్తే ఫర్వాలేదని ఉచిత సలహా ఇచ్చారు.
విజయవాడలోని సమగ్ర శిక్ష అభియాన్‌లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఒక ప్రశ్నకు మంత్రి బొత్స ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం హేతుబద్ధీకరణ ఉత్తర్వులు-117ను తీసుకొచ్చింది. దీని ప్రకారం 98 మంది లోపు విద్యార్థులుండే ప్రీ హైస్కూల్(ప్రాథమికోన్నత) బడులకు సబ్జెక్టు టీచర్లను ఇవ్వడం లేదు.
ఇక్కడ 3-8 తరగతులకు సెకండరీ గ్రేడ్ టీచర్లే(ఎస్జీటీ) చదువు చెబుతారు. ఈ అంశంపై మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 98 మందిలోపు పిల్లలు ఉన్న ప్రీహైస్కూళ్లలో అయిదుగురు సబ్జెక్టు టీచర్లను పెట్టేందుకు వీలు కాదని అభిప్రాయపడ్డారు. టీచర్లను పంపిస్తే అక్కడ అనేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని, పిల్లలు తక్కువై టీచర్లు ఎక్కువైతే ఎలా? అందుకే అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. తక్కువ మంది పిల్లలున్న ప్రీహైస్కూళ్లను సమీప బడుల్లో విలీనం చేయాలని భావిస్తున్నామన్నారు.