మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 8 డిశెంబరు 2020 (19:40 IST)

కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకోండి: గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఏలూరు సంఘటనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ విషయంపై మంగళవారం గౌరవ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చరవాణి ద్వారా సంభాషించారు. స్థానికంగా నెలకొన్న తాజా పరిస్థితులను గవర్నర్ తెలుసుకున్నారు.
 
గత మూడు రోజులుగా సుమారు 467 మంది వింత వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చేరారని, ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం అందించటం వల్ల 263 మంది కోలుకుని తమ నివాసాలకు చేరుకున్నారన్నారని సిఎం వివరించారు. వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి చేరుతున్న వారందరికీ పూర్తి స్థాయి వైద్యం అందిస్తున్నామని, అత్యవసర పరిస్థితిలో ఉన్న వారిని విజయవాడ తరలించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
 
వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు జాతీయ స్థాయి వైద్య ఆరోగ్య పరిశోధనా సంస్ధల సహకారం తీసుకుంటున్నామని, ఎయిమ్స్, ఐఐసిటి, సిసిఎంబి, ఎన్ఐఎన్ వంటి సంస్ధలు బాధితుల రక్త నమూనాలతో పాటు అవసరమైన ఇతర అన్ని నమూనాలను పరిక్షిస్తున్నాయని ముఖ్యమంత్రి  తెలిపారు.
 
వింత వ్యాధి బాధితుల సమస్యను పరిష్కరించే క్రమంలో, ప్రభుత్వపరంగా మరింత అప్రమత్తత అవసరమని, వేగవంతమైన పనితీరు కనబరిచేలా స్థానిక, వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గవర్నర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని, ప్రజలకు అన్ని విధాల ధైర్యం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రికి తెలిపారు.