శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 3 డిశెంబరు 2020 (14:34 IST)

సీఎం జగన్‌ను పొగడటంలో వైకాపా ఎమ్మెల్యేలను మించిపోతున్న జనసేన ఏకైక ఎమ్మెల్యే

జనసేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ. ఈ పార్టీ నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తి రాపాక వరప్రసాద్. మొదట్లో పార్టీని కవర్ చేస్తూ మాట్లాడుతూ వచ్చిన ఆయన ఆ తర్వాత పూర్తిగా యూ టర్న్ తీసుకున్నారు. అవకాశం దొరికితే చాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేస్తున్నారు.
 
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి రాపాక చేసిన పొగడ్తలు ఇంతవరకూ వైకాపా ఎమ్మెల్యేలు కూడా చేసి వుండరేమోనని అంటున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. చంద్రబాబు పాలనలో గ్రామానికి 84 పింఛన్లు వుంటే వైఎస్సార్ వచ్చాక అది 500కి పెరిగాయి. గ్రామంలో అర్హులెవరో వెతికి మరీ మహానేత వైఎస్సార్ పింఛన్లు ఇచ్చారనీ, ఆ మహానేత మరణం రాష్ట్రానికి తీరని లోటని చెప్పారు.
 
జగన్ గారు తాము అధికారంలోకి వస్తే రూ. 2000 ఇస్తామని అంటే, హుటాహుటిన బాబు ఆ పని చేసారన్నారు. అది జగన్ గారి ఆలోచనను ఆచరణలో పెట్టారంతే. నిజానికి బాబుకి అలాంటి ఆలోచనలు లేవని విమర్శించారు. జన్మభూమి కమిటీల్లో సభ్యులు కమీషన్లంటూ జలగల్లా పట్టుకుని తినేసేవారు. కానీ మహానేత వైఎస్సార్ పాలన ఎలా సాగిందో అలాగే నేడు వైఎస్ జగన్ పాలన సాగుతోందనీ, గ్రామ సచివాలయం అనేది దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
 
జగన్ గారికి ఆయన మేనిఫెస్టో బైబిల్, భగవద్గీత, ఖురాన్ అనీ, అందులో తను చెప్పినవన్నీ నెరవేర్చుతున్నారనీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్నప్పటికీ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేస్తున్న మహానాయకుడని కొనియాడారు. ఇలాంటి వ్యక్తిని సీఎంగా ఎన్నుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజల అదృష్టమన్నారు. జగన్ గారు ఏపీకి ముఖ్యమంత్రిగా మరో వందేళ్లు పాలించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు రాపాక. మరి రాపాకపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఏమీచేయలేక చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు. ఇది నిజంగా జనసేనాని సహనానికి పెద్ద పరీక్షే.