అమరావతిలో నో ఫ్లై జోన్ అమలు... ఎందుకని?
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ సభ జరిగే ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్‌గా అధికారులు ప్రకటించారు. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్లు ఎగురవేయడానికి కూడా అనుమతి ఉండదని డ్రోన్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అలాగే, గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల ఇవే నిబంధనలు అమలు చేయనున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే కార్యక్రమానికి కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతను కల్పించారు.
కాగా, నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ శుక్రవారం తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తదితరులు స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి ప్రధాన హెలికాఫ్టరులో అమరావతికి చేరుకుంటారు. ఇందుకోసం నాలుగు హెలికాఫ్టర్లు సిద్ధంగా ఉంచారు. అయితే వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గంలో వెళ్లేలా ఏర్పాట్లు కూడా చేశారు.
విమానాశ్రయం నుంచి చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపైకి వచ్చి కేసరపల్లి - గూడవల్లి - ఎనికేపాడు - రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తారు. అక్కడ నుంచి బెంజి సర్కిల్, ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి కరకట్ట మీదుగా రాజధాని ప్రాంతానికి చేరుకుంటారు. ఈ మార్గంలో కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇదికాకుండా మరోమార్గాన్ని కూడా సిద్ధం చేశారు. ఆ సమయంలో రోడ్డు షో నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతం కూడా నో ఫ్లై జోన్ పరిధిలోకి వస్తుంది. ఎక్కడా బెలూన్లు కూడా ఎగురవేయకూడదని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ప్రజలకు సూచించారు.