గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (17:54 IST)

సుప్రీం చెంతకు నిమ్మగడ్డ కేసు : హైకోర్టు తీర్పును సవాల్ చేసిన సర్కారు!

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇపుడు సుప్రీంకోర్టు చెంతకు చేరింది. రమేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పైగా, ఎస్ఈసీగా నిమ్మగడ్డనే పునర్నియమించాలంటూ ఆదేశిస్తూ తీర్పును వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం లేదా బుధవారాల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
 
ముఖ్యంగా, నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అభ్యంతరాలను పిటిషన్‌లో ప్రభుత్వం లేవనెత్తినట్లు సమాచారం. ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వానికి ఉన్న హక్కల మేరకే కమిషనర్‌గా కనగరాజును నియమించామని ప్రభుత్వం చెబుతోంది. కమిషనర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని, కనగరాజు నియాయకం చెల్లుతుందని ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం అభ్యర్థించింది. 
 
ఇదిలావుంటే, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన హోం మంత్రి అమిత్ షాతోనూ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఇందులో నిమ్మగడ్డ పంచాయతీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.