దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుకు మరో షాక్
దుర్గగుడి మాజీ ఈవో ఎం.వి.సురేష్‌బాబుకు ప్రభుత్వం మరో షాకిచ్చింది. సురేష్‌బాబు ఆర్జేసీ హోదాను దేవాదాయ శాఖ రద్దు చేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో బుధవారం సురేష్‌బాబును రాజమహేంద్రవరం ఆర్జేసీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్జేసీ నియామకపు ఉత్తర్వులను రద్దు చేస్తూ జీవో 208 విడుదల చేశారు. దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సురేష్‌బాబుకు ఆదేశాలు చేశారు.
శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో సురేశ్‌బాబును ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రాజమహేంద్రవరం రీజనల్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న డి.భ్రమరాంబను దుర్గగుడి ఈవోగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సురేష్‌బాబును భ్రమరాంబ స్థానంలో రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా నియమించారు.
సురేష్‌బాబు దుర్గగుడి ఈవోగా 2019 ఆగస్టులో నియమితులయ్యారు. దుర్గగుడిలో అడుగుపెట్టిన నాటి నుంచే పలు ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. తాత్కాలిక పదోన్నతిపై డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న సురేశ్‌బాబును జాయింట్ కమిషనర్ స్థాయి ఆలయమైన దుర్గగుడికి ఈవోగా నియమించడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అర్హత లేకున్నా దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు భారీగా ముడుపులు ముట్టచెప్పి ఈవోగా నియమితులయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.