బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:22 IST)

హిట్‌కు గెలుపునకు ఏమిటి సంబంధం?: మంత్రి పేర్ని నాని

తిరుపతిలో ఏపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, వకీల్ సాబ్ చిత్రానికి తిరుపతి ఉప ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారారు. ‘దేశ రాజకీయాలను, భారత ప్రభుత్వాన్ని నడుపుతున్న ఇక్కడ పార్టీ రాష్ట్ర పరిశీలకుడిగా వచ్చిన సునిల్‌ డియోధర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి చేస్తున్న పని, పవన్‌ కళ్యాణ్‌ సినిమా టికెట్‌ పొందడం. ఆయన ఆ సినిమా కోసం ఉదయం 3 గంటలకు లేచి తయారై సినిమా థియేటర్‌ దగ్గరకు పోయి ఉదయం 5 గంటల నుంచే అక్కడ మెట్ల మీద కూర్చుని టికెట్‌ పొందితే సినిమా వేయలేదట. ఆయన అంటాడు సీఎం వైయస్‌ జగన్, ప్రతి శుక్రవారం కోర్టుకు పోకుండా వాయిదాలు కోరుతున్నాడని. 
 
రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం టాకీసుల్లో రోజుకు 4 షోలు మాత్రమే వేయాలి. అవి కూడా ఉదయం 11 తర్వాత ప్రారంభించి, అర్ధరాత్రి కల్లా ముగించాలి. ఆ స్పెషల్‌ షో టికెట్‌ ఏకంగా రూ.1000. దానికి పర్మిషన్‌ ఇవ్వలేదని సునిల్‌ దియోధర్‌ సీఎంను విమర్శిస్తున్నాడు. కానీ ఇక్కడ ఎవరు, ఎవరిని దోచుకుంటున్నారు? సినిమా చూసే వాళ్లు ఎక్కువ మంది పేదలు, మధ్య తరగతి వారు’.
 
హిట్‌కు గెలుపునకు ఏమిటి సంబంధం?
‘వకీల్‌ సాబ్‌ సినిమా హిట్‌ అవుతుంది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని సునిల్‌ అంటున్నారు. సినిమా హిట్‌కు, పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికలో గెలుపునకు సంబంధం ఏమిటి? అంటే ఆయన ఉద్దేశం, ఇక్కడి ప్రజలు పిచ్చోళ్లు. ఆ హీరో ఏం చెబితే అది చేస్తారని. ఒక వేళ అదే నిజమైతే, ఇదే వకీల్‌సాబ్‌ (పవన్‌ కళ్యాణ్‌) గతంలో బీజేపీని తిట్టారు. చేయి చాపి సాయం అడిగితే తెలుగు వారిపై బీజేపీ ఉమ్మేసిందని పవన్‌ కళ్యాణ్‌ విమర్శించాడు. హోదాకు బదులు పాచిపోయిన లడ్లు ఇచ్చారని తిట్టాడు’.
 
సిగ్గు ఎందుకు పెట్టలేదో?:
‘ఆ దేవుడు బీజేపీ నేతలకు, పవన్‌ కళ్యాణ్‌కు సిగ్గు ఎందుకు పెట్టలేదో? 2014 నుంచి 2019 వరకు పవన్‌కళ్యాణ్‌ బీజేపీని నానా తిట్లు తిట్టారు. బీజేపీ ద్రోహం చేసిందని విమర్శించారు. హోదా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఆ మాటలు జనం ఇంకా మర్చిపోలేదు. అదే పవన్‌ ఇవాళ వచ్చి కమలం గుర్తుకు ఓటేయమని అడుగుతున్నాడు. ఇద్దరూ ఎలా కలిసి మెలిసి తిరుగుతున్నారు? వారి మధ్య వ్యాపార సంబంధం, ఒప్పందాలు తప్పితే, సిద్ధాంతపరంగా ఏమీ కనిపించడం లేదు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది ఏదీ కనిపించడం లేదు’.
 
మీకు ఓటెందుకు వేయాలి?:
‘ఇవాళ సునిల్‌ గారిని ఒకటే అడుగుతున్నాం. తిరుపతి ఉప ఎన్నికలో కమలానికి ఎందుకు ఓటేయాలని చెప్పే ధైర్యం మీకు లేదు. ఈ రాష్ట్రాన్ని విశ్వాస ఘాతక కాంగ్రెస్‌తో చేతులు కలిపి నమ్మకద్రోహంగా విడగొట్టిన బీజేపీకి ఎందుకు ఓటేయాలి? విభజన హామీల్లో ఒకటైన కడప ఉక్కు ఫ్యాక్టరీని మంజూరు చేయనందుకా మీకు ఓటు వేయాలి? రామయ్యపట్నం, దుగ్గరాజుపట్నం పోర్టులు కడతామని చెప్పి, కట్టనందుకు మీకు ఓట్లు వేయాలా? ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఏటా రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లు ఇస్తామని చెప్పి, 350 పైసలు కూడా ఇవ్వనందుకు మీకు ఓటేయాలా?

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఇవాళ్టి వరకు ఆ ఊసే ఎత్తనందుకా మీకు ఓటు వేయాలి? పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల తరలింపు, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి ఇంత వరకు రాత పూర్వకంగా హామీ ఇవ్వనందుకా తిరుపతి ప్రజలు పూవు గుర్తుకు ఓటేయాలి? విశాఖ రైల్వే జోన్‌ ఇస్తామన్న హామీని మూట గట్టి పార్సిల్‌ చేసినందుకు ఓటేయాలా? వెంకన్న స్వామి పాదసాక్షిగా హోదాపై ఇచ్చిన మాటను ప్రధాని మోదీ, ఆ తర్వాత తూచ్‌ అని తుడిచేయడానికా మీకు ఓటు వేయాలి? ఆ విధంగా తెలుగు ప్రజలకు పంగనామాలు పెట్టినందుకా, మీరు ఇవాళ పంగ నామాలతో సినిమా చూడడానికి వెళ్లారు’.
 
ఈ సినిమాకు భయపడతారా?:
‘సునిల్‌ ధియోధర్‌ గారూ, పవన్‌ కళ్యాణ్‌ సినిమా కూడా ఒక పాచిపోయిన సినిమా అని గుర్తు చేసుకోండి. హిందీలో అమితాబ్‌ గారు పింక్‌ పేరుతో, ఆ తర్వాత తమిళంలో అజిత్‌ ఈ సినిమా తీశారు. కాబట్టి ఇది మూడో సినిమా. ఈ సినిమాకే జగన్‌ గారు భయపడితే, భవిష్యత్తులో పవన్‌కళ్యాణ్, మోదీ గారు చూపే సినిమా వస్తే పరిస్థితి ఏమిటన్నది సునిల్‌ ప్రస్తావిస్తున్నారు. ఒక్కరుగా వచ్చినా, ఇద్దరూ వచ్చినా జగన్‌మోహన్‌రెడ్డి గారు, ఎవరీకి భయపడరు. సోనియా అంతటి నియంతకే ఆయన అస్సలు భయపడలేదు. చంద్రబాబు, సోనియా కలిసి కక్షతో 16 నెలలు జైలులో పెట్టినా జగన్‌ గారు భయపడలేదు. తొణకలేదు. అంతటి ధైర్యం ఆయనది’.
 
షా ఎవరికి భయపడుతున్నారు?
‘ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్‌గారు, వకీల్‌సాబ్‌ సినిమాకు భయపడుతున్నారని సునిల్‌ ట్వీట్‌ చేశారు. మరి సొహబుద్దీన్‌ హత్య కేసులో ఆరు నెలలు జైలులో ఉన్న అమిత్‌షా ఎవరికి భయపడుతున్నారు?’. 
 
ఎవరికి అచ్చే దిన్‌?:
‘అచ్చే దిన్‌ ఆయేగా అని సునిల్‌ అంటున్నారు. అవి మీకు మాత్రమే వచ్చాయి. మీరు ఆంధ్రకు వచ్చి ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఇన్ని రోజులు తిరిగావు. నామాలు పెట్టుకున్నావు. సినిమాలు చూశావు. కాబట్టి, ఈ రాష్ట్రానికి ఏమేం చేస్తామని మీ పార్టీ చెప్పిందో, అవన్నీ అమలయ్యేలా చూడండి’. 
 
జగన్‌ గారి దెబ్బకు..:
‘చంద్రబాబు గారు చివరకు ఆయనకు ఆయనే భజన చేసుకుంటున్నారు. ఆయన పొద్దున అన్నారు.. ‘ప్యాలెస్‌లో ఉండే జగన్‌ను తాను తిరుపతి రోడ్ల మీదకు తీసుకువస్తున్నానని’.. అయ్యా చంద్రబాబుగారు మీరు పూరిగుడిసెలో ఉంటున్నారా? మీది రాజభవనం కాదా?. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటావు. 14 ఏళ్లు సీఎంగా చేసిన నిన్ను, ఇవాళ జగన్‌గారు ఏ స్థాయికి తీసుకువచ్చారు. సందు సందు తిరుగుతూ ఏమేం చేశానన్నది చెప్పుకుంటున్నావు’.
 
ఎందుకంత భయం?:
‘జగన్‌ గారు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం ఈనెల 14న, కేవలం 30 నిమిషాల సభ కోసం వస్తుంటే భయపడి ఏదేదో మాట్లాడుతున్నారు. తాము 22 నెలల్లో ఏమేం చేశామన్నది చెప్పి, ఓట్లు అడగడానికి వస్తుంటే, అందరూ భయపడి విమర్శలు చేస్తున్నారు. నిజానికి ఈ ఎన్నికల్లో ఓడిపోయామని ఇప్పటికే మీరు ఒప్పుకున్నారు. ప్రజాస్వామ్యంపై జగన్‌ గారికి అచంచల విశ్వాసం. ప్రజలే దేవుళ్లు అని ఆయన గట్టిగా నమ్మారు. అందుకే వస్తున్నారు. అందుకు మీరంతా భయపడుతున్నారు’.
 
‘ఇక బీజేపీ ప్రకటించిన సీఎం అభ్యర్థి ఇక్కడికి వచ్చి సందు సందు తిరుగుతారంట. ఇక భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి బహిరంగ సభ పెడతాడంట. ఇంకా 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు ఇద్దరూ సందు సందు తిరుగుతారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి గారు మాత్రం ఓట్లు అడగడానికి రాకూడదంట!. ఇదీ వీరి రాజకీయ పలాయనం’.
 
ఆ మాటలు చెప్పగలరా?
‘జగన్‌ ఈనెల 14న తిరుపతి వస్తున్నారు. వీలుంటే ఆ రాత్రి ఇక్కడే ఉండి, మర్నాడు స్వామి వారిని దర్శించుకోవచ్చు. తమ పార్టీకి ఎందుకు ఓటేయాలో జగన్‌ గారు చెబుతారు. అలాగే టీడీపీ, బీజేపీ కూడా చెప్పుకోవాలి. అంతేతప్ప ఇంత కంటే దౌర్భాగ్యంగా విమర్శలు చేయొద్దు’.
 
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
‘రత్నప్రభను గెలిపిస్తే తప్ప అభివృద్ధి చేయరా? గత ఎన్నికల్లో జాతీయస్థాయిలో ఆ పార్టీని గెలిపించారు కదా? మరి ఎందుకు అభివృద్ధి చేయలేదు. 
 
అంటే ఎంతసేపూ తాయిలాలు మాత్రమే. ఇప్పుడు కూడా పుదుచ్చేరికి హోదా ఇస్తామంటున్నారు. మీకు, చంద్రబాబుకు కలిపి నాడు 2014లో ఓటు వేస్తే రాష్ట్రానికి మీరు ఏం చేశారు? మీరు రుణపడి ఉన్నారు. కాబట్టి దాన్ని తీర్చుకోండి. ఇప్పుడు కూడా అన్నీ అమ్ముకోవడానికేనా మళ్లీ ఓట్లు అడుగుతున్నారు. గెలిపించమని కోరుతున్నారు. చంద్రబాబును ఇప్పటికే చిత్తూరు ప్రజలు పరుగెత్తించారు. భవిష్యత్తుల్లో జిల్లా నుంచే తరిమేస్తారు’.. అంటూ మంత్రి పేర్ని నాని ప్రెస్‌ మీట్‌ ముగించారు.