ఆ ఫామ్ ఇచ్చిన చోట విచారించే అధికారం ఎస్ఈసీకి లేదు : హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏపీ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణలు, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న ఎస్ఈసీ ఆదేశాలను కోర్టు రద్దు చేసింది.
గతంలో ఏకగ్రీవం అయినవారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది... ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి ఎవరైనా బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాల కారణంగా నామినేషన్ వేయలేకపోయారో వారు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు జరిపి.. అది నిజమని తేలితే వాళ్లను మళ్లీ అభ్యర్థిగా పరిగణిస్తామని ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొంతమంది ఏకగ్రీవమైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు గతంలో తీర్పును రిజర్వు చేసింది. తాజాగా మంగళవారం దీనిపై విచారణ జరిపిన న్యాయం స్థానం.. గతంలో ఏకగ్రీవమైన వారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశిస్తూ, ఏకగ్రీవాలపై దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని తీర్పు వెలువరించింది. అలాగే ఎక్కడైతే ఎన్నికలు నిలిచిపోయాయో.. అక్కడ మళ్లీ ఎన్నికలు జరుపుకోవచ్చునని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.