శుక్రవారం, 10 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 అక్టోబరు 2025 (12:24 IST)

వైద్య కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి? హైకోర్టు ప్రశ్న

High Court
రాష్ట్రంలో వైద్య కాలేజీలను ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మిస్తే తప్పేంటి అని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిధులతో నిర్మించాలంటే కొన్నేళ్ళు పడుతుందని గుర్తు చేశారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో న్యాయస్థానాలకు భవనాల నిర్మాణం ఏళ్ళతరబడి పూర్తికాలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. ఈ విషయంలో పిలిచిన టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. 
 
పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా? అని వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో ఆసుపత్రులను నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని గుర్తుచేసింది. రాజ్యాంగ, చట్టవిరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని తెలిపింది.
 
ఈ అంశంలో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని సీఎస్, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ వైద్య విద్య, పరిశోధన సంస్థ ఎండీకి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వుల్చింది.
 
'నిధుల కొరత కారణంగా వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అది తప్పెలా అవుతుంది? నిధుల కోసం ప్రభుత్వం బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. నిధుల కొరత వల్ల జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణాలూ నిలిచిపోయాయి. డబ్బు లేనప్పుడు ప్రభుత్వమే వైద్య కళాశాలలు, ఆసుపత్రులను కట్టాలంటే ఏళ్ల సమయం పడుతుంది. నిధులున్నప్పుడే కళాశాలలను నిర్మించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదు. ఇలాంటి వ్యవహారాల్లో అందరం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవు' అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
 
రాష్ట్రంలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం వైద్య కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబరు 9న రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవో 590ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో పిల్ వేశారు. 
 
ఆమె తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. 'ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. బిడ్‌లో విజేతగా నిలిచిన ఏజెన్సీ / సంస్థ 33 ఏళ్ల వరకు ఆ కళాశాలను నిర్వహిస్తుంది. వైద్య కళాశాలల నిర్మాణ పనులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 సెప్టెంబరులో నిర్ణయం తీసుకుంది. నిధుల కొరత ఉందని ప్రస్తుత ప్రభుత్వం చెప్పట్లేదు. గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలలకు రూ.5,800 కోట్ల పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చారు' అని చెప్పారు.