వైకాపా మంత్రుల బూతు పురాణంతో జనాలు పరుగో పరుగు: అచ్చెన్నాయుడు ప్రశ్న
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వయసు, ఆయనకు ఉన్న అనుభవానికి అయినా కూడా మంత్రులు కనీసం విలువ ఇవ్వడం లేదని విమర్శించారు.
జగన్ మంత్రివర్గంలో కొందరు మంత్రులు బూతుల మంత్రులుగా మారిపోయారని విమర్శించారు. మంత్రుల యెుక్క బూతు దండకం చూసి జనం భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రజా రాజధాని అమరావతిపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.
అమరావతి రాజధానిపై ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రస్తావించనున్నట్లు తెలిపారు. రాజధానిపై సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌తో తనకు వ్యక్తిగత విబేధాలు లేవని చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు. జగన్‌ను తాను వ్యతిరేకించడం లేదని ఆయన తప్పుడు నిర్ణయాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన అత్యంత దరిద్రమైన పాలన అని విమర్శించారు. ప్రజలంతా జగన్ పాలనను తీవ్రంగా విమర్శిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ కలిసి ఉంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇకపోతే రాబోయే రోజుల్లో జనసేన పార్టీతో కలిసి వెళ్లాలా వద్దా అన్నది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పొత్తుల అంశం అప్రస్తుతం అని చెప్పుకొచ్చారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ దూరంగా లేరన్నది ఎంత నిజమో తాము కూడా బీజేపీకి దూరం కాలేదన్నారు.