ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవిత్రయజ్ఞంగా సాగుతున్న గ్రామీణ గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని గ్రామీణ గృహనిర్మాణ శాఖా మంత్రి కాలవ శ్రీనివాసులు కోరారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో భాగంగా సోమవారం గృహనిర్మాణంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడారు. సభలో సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పంచకర్ల రమేష్‌బాబు, గిడ్డి ఈశ్వరి, గణబాబు, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రి కాలవ శ్రీనివాసులు సమాధానాలు ఇచ్చారు.
నిరుపేదల సొంతింటి కల సాకారం చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకూ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ పథకాల కింద రూ13, 911 కోట్ల నిధులతో 11,15,452 ఇళ్లు మంజూరు చేశామన్నారు. పట్టణాల్లో సొంతంగా స్థలాలు కలిగిన పేదలకు 1,64,446 ఇళ్లు నిర్మిస్తూనే.. గత ప్రభుత్వ హయాంలో మంజూరై అసంపూర్తిగా నిలిచిపోయిన 49,067 గృహాలను కూడా తమ ప్రభుత్వమే కట్టించి ఇస్తోందని మంత్రి తెలిపారు. పదమూడు జిల్లాలలోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదలకు రూ. 20,217 కోట్లతో 13,28,965 ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు.
నాలుగేళ్ల కాలంలో రూ.6857 కోట్ల ఖర్చుతో 6,46,086 గృహాలు పూర్తి చేసి రికార్డు నెలకొల్పామన్నారు. పేదల కలలు సాకారం కావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని, దేశంలోనే ఇది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అంశమన్నారు. గతంలో గృహనిర్మాణ పథకాల అమలుకు కేంద్రం బాగానే సహకరించేదని, ప్రస్తుతం సహాయం తక్కువగా వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గుజరాత్‌లో ఒక లక్ష గృహాలను ప్రారంభిస్తూ చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తనకు గుజరాత్ రాష్ట్రం ఎన్నో పాఠాలు నేర్పిందని, కలలను ఒక నిర్ణీత గడువులోగా నెరవేర్చుకోవాలని నేను నేర్చుకున్న పాఠాలలో ఇది ఒకటని ప్రధాని మోదీ తన ప్రసంగం ద్వారా సంతోషం వ్యక్తం చేశారని మంత్రి ఉదహరించారు.
26 జిల్లాలున్న గుజరాత్ రాష్ట్రం గ్రామీణ జనాభా 3 కోట్ల 46 లక్షల 70 వేలు అయితే నిర్మించిన గృహాలు 1 లక్షా 15 వేలని, ఇదే జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 6 లక్షల గృహాలు నిర్మాణం పూర్తి చేశామన్నారు. గతేడాది గాంధీ జయంతి, ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా 1 లక్ష గృహప్రవేశాలు అత్యంత ఘనంగా జరిపామని, ఈ ఏడాది జూలై 5న 3,00,346 గృహాలలో ఒకేసారి గృహప్రవేశ మహోత్సవాలు నిర్వహించామని, ఇది ప్రపంచంలోనే అరుదైన రికార్డని మంత్రి తెలిపారు. పేదలు తాము శాశ్వతంగా పక్కా ఇళ్లు కట్టుకున్న సందర్భంగా జరుపుకున్న పండగతో సందడిగా మారిందని.. ఇది చాలా సంతోషకరమైన సందర్భమని మంత్రి వివరించారు.
ఇళ్ల నిర్మాణం ఆరంభంలో చాలా ఇబ్బందులొచ్చాయని, ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా అన్నీ పరిష్కరించారని ..దీంతో ఇళ్ల నిర్మాణం సాధ్యమైందన్నారు. గతంలో ఇంటి నిర్మాణానికి 450 గజాలుంటే.. 500గా, తరువాత 750 గజాలుగా మార్పు చేశామని తెలిపారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల పూర్తికి అదనంగా రూ.25 వేలు సాయంగా అందించామని, దీని కోసం రూ.500 కోట్లు సీఎం ఇచ్చారని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.1480 కోట్లు ప్రత్యేకంగా కేటాయించామన్నారు. గృహనిర్మాణానికి ఇస్తున్న ఒక లక్షా ఏభై వేలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1,25,540 ఇస్తోందన్నారు. మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ మంజూరైన 2,80,616 ఇళ్లలో పూర్తయినవి 13,548 మాత్రమేనని మంత్రి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు సామాజిక సాధికారిక సర్వే ద్వారా 20 లక్షల మంది గృహాలకు అర్హులని గుర్తించి కేంద్రానికి నివేదించినా, ఇంతవరకూ ఒక్క ఇల్లు కూడా అదనంగా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు చెందిన నిరుపేదలున్నారని నివేదిక ఇచ్చామన్నారు. కేంద్రం అడిగిన మరింత సమాచారం మేరకు ఇప్పటివరకూ 6,70,000 కుటుంబాల వివరాలు అందజేశామని, అయినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. ఒక యజ్ఞంలా చేపట్టిన గృహనిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు.
పీఎంఏవై నిర్మాణాలను అన్ని రాష్ట్రాలు చేపట్టాయని, అయితే ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న యూనిట్ కాస్ట్ రూ. 2లక్షలను మన దేశంలోని ఏ ఏ రాష్ట్రంలోనూ, కేంద్రపాలిత ప్రాంతంలోనూ ఇవ్వటం లేదని సభకు వివరించారు. ఒక్కో గృహ లబ్ధిదారుడికి కేంద్రం ఇస్తున్నది కేవలం రూ.72 వేలేనని, యూనిట్ కాస్ట్ పెంచి వివిధ పథకాల ద్వారా రాష్ట్రప్రభుత్వం మేలు చేకూరుస్తోందన్నారు. ఒక యజ్ఞంలా, పారదర్శకంగా పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయసహకారాలు అందించాలని కోరారు.