1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (09:35 IST)

క్యూఎస్ ర్యాంకు 200 లోపు ఉంటేనే విదేశీ విద్యా సాయం : మంత్రి నాగార్జున

meruga nagarjuna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థులకు విదేశీ విద్యా సాయంలో మెలిక పెట్టింది. క్యూఎస్‌ ర్యాంకు 200లోపు ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన పేద విద్యార్థులకే 'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకాన్ని అమలు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. 
 
క్యూఎస్‌ ర్యాంకుల్లో మొదటి వంద స్థానాల్లోని వర్సిటీల్లో సీట్లు సాధించిన వారికి పూర్తిగా ఫీజు చెల్లిస్తామని, 100-200 మధ్య ర్యాంకుల్లో ఉన్న వాటిలో ప్రవేశాలు పొందిన వారికి రూ.50 లక్షల వరకు ఫీజు చెల్లిస్తామని వెల్లడించారు. 
 
సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'గతంలో ఈ పథకానికి రూ.6 లక్షల వరకు ఆదాయ పరిమితి ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచాం. విదేశీ వర్సిటీల్లో సీట్లు పొందేందుకు అవసరమైతే ఎస్సీ, ఎస్టీలకు శిక్షణ ఇస్తామన్నారు. 
 
గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకం అమల్లో లోపాలున్నట్లు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ విచారణలో తేలింది. 2016-17లో ఎంపికైన 3,326 మంది విద్యార్థులకు రూ.318 కోట్ల బకాయిలను చెల్లించలేదు' అని ఆయన వివరించారు.