శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 15 జూన్ 2024 (11:09 IST)

మంగళగిరిలో నారా లోకేశ్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ (Video)

lokesh prajadarbar
ఏపీ రాష్ట్ర విద్యాశాఖామంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ అపుడే కార్యరంగంలోకి దిగిపోయారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన మంగళగిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించారు. ఇందుకోసం ఆయన మంగళగిరిలోని తన నివాసంలో శనివారం ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూనే వారి సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 
 
నిజానికి తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 
 
నారా లోకేశ్‌ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజా దర్బార్‌ నిర్వహించారు. దీంతో సమస్యలు విన్నవించేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేశ్‌ వారికి హామీ ఇచ్చారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
ఇదిలావుంటే, టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు అధినేత చంద్రబాబు శనివారం రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్టీ కార్యాలయానికి రానున్నారు. చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ కార్యాలయ వర్గాలు భారీగా ఏర్పాట్లు చేశాయి. ఇకపై తరచూ పార్టీ కార్యలయానికి వెళ్లేలా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ చేశారు. పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.