సొంత పార్టీ నేతలకే వైకాపా హెచ్చరికలు... కౌలు కట్ చేస్తామంటూ బెదిరింపులు
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపా నేతలు చేస్తున్న బెదిరింపులు నానాటికీ శృతిమించిపోతున్నాయి. ప్రత్యర్థులనే కాదు.. చివరకు సొంత పార్టీ నేతలను సైతం వారు హెచ్చరిస్తున్నారు. బెదిరింపులతో సరిపెట్టుకోని నేతలు.. పలు ప్రాంతాల్లో దాడులకు సైతం దిగుతున్నారు. అంతటితో ఆగని నేతలు.. వారి నోటి దగ్గర కూడు కూడా లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
సాక్షాత్ ఏపీ హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గంలో సొంత పార్టీ వారికే రక్షణ లేకుండా పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. వట్టిచెరుకూరు మండలం కర్నూతల వైసీపీ రెబల్‌గా నామినేషన్ వేయడానికి వెళుతున్న వారిపై దాడి చేసిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్ వేసిన రెబల్ వర్గంపై ఇప్పుడు బెదిరింపుల పర్వంప్రారంభమైంది. ఈ వర్గంలో ఎక్కువ శాతం పొలాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. ఈ క్రమంలో గురువారం పొలాలకు వెళ్లే నీటి పైపులను పగల గొట్టడమే కాకుండా నామినేషన్ విత్‌డ్రా చేసుకుంటేనే పంటకు నీరిచ్చేది అంటూ బెదిరించారు.
పొలాల్లో ట్యూబులు, ఇంజన్లు పగలగొడుతున్నారన్న సమాచారంతో పోలీసులు వచ్చేసరికి వారంతా పరారయ్యారు. బాధితులు గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ ప్రశాంతితో పాటు స్థానిక పోలీసుల వద్ద తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలు కూడా ఇవ్వమంటున్నారని, మా నోటి వద్ద కూడు లేకుండా చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అంశంపై పోలీసులు సీరియస్‌గా దృష్టిసారించారు.