బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 13 డిశెంబరు 2021 (19:35 IST)

నాగార్జున యూనిర్సిటీ ఎదురుగా అశ్లీల పోస్ట‌ర్లా? రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్!

సమాజంలో యువతను తప్పు దోవ‌ పట్టించే అశ్లీల సినిమా పోస్ట‌ర్ల‌పై  ఏపి రాష్ట్ర మహిళా చైర్ కమిషన్ సీరియ‌స్ అయింది. అశ్లీల సినిమాలు, సాహిత్యం, హింస, అశ్లీల వాల్ పోస్టర్లు మూడ నమ్మకాలు ప్రేరేపించే చేతబడి, దెయ్యాలు భక్తి విశ్వాసాలు రంగురాల్లు జ్యోతిష్యం వంటివి సమాచార ప్రసార మాధ్యమాలలో నిషేధించాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతూ ఉన్న అశ్లీల ప్రతిఘటన వేదిక, ఏపి మహిళా సమాఖ్య విద్యార్థి యువజన సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో కదిలిన ఏపి రాష్ట్ర మహిళా చైర్ కమిషన్ అశ్లీల పోస్టర్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంది. 
 
 
గుంటూరు, విజయవాడ జాతీయ రహదారి మార్గంలోని అండర్ బ్రిడ్జ్ ల వద్ద అశ్లీల పోస్టర్లు, హోర్డింగ్స్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. వాటిని ఏర్పాటుచేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఐసీడీఎస్, జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న అండర్ బ్రిడ్జ్ వద్ద అశ్లీల పోస్టర్లు ఉండటంపై యూనివర్సిటీ రిజిస్టార్ ని సైతం వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిన గుంటూరు ఐసీడీఎస్ పీడి మనోరంజని ఆధ్వర్యంలో మంగళగిరి రూరల్, పెదకాకాని పోలీసులు రంగంలోకి దిగి అశ్లీల పోస్టర్లను శుక్రవారం తొలగించారు.
 
 
ఐసీడీఎస్ డీసీపీఓ విజయ్ తమ సిబ్బందితో పలుచోట్ల అశ్లీల సినీ పోస్టర్లను తొలగించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, ఇక మీదట అశ్లీల బొమ్మలతో వాణిజ్య ప్రకటనలుగానీ, సినిమాలకు సంబంధించిన పోస్టర్లు గానీ, హోర్డింగులు గానీ ఏర్పాటు చేయవద్దని చెప్పారు. రోడ్డు డివైడర్ల మీద, రోడ్డు జంక్షన్లలో, ట్రాఫిక్ ఐలాండ్ల చుట్టూ ఎటువంటి పోస్టర్లు అతికించరాదని, అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. మహిళా శిశు సంక్షేమశాఖతో పాటు పోలీసు సిబ్బంది తమ పరిధిలో ప్రతి రోజూ పర్యటిస్తూ అశ్లీలకరంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్, పోస్టర్స్ అంటించే వారి వివరాలు తెలుసుకొని చట్టపర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.