విభజన చట్టంలోని అంశాలపై కేంద్ర హోం శాఖ భేటీ
తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజనాంశాలతో పాటు విభజన చట్టంలోని అంశాలపై బుధవారం కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం కానున్నారు. మొదట ఢిల్లీలో ప్రత్యక్ష సమావేశం అనుకున్నప్పటికీ కోవిడ్ కేసుల నేపథ్యంలో సమావేశాన్ని దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ తొమ్మిది అంశాలను ఎజెండాలో పొందుపర్చింది. విభజన చట్టం తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన, విద్యుత్ బకాయిలు, ఏపీ-ఎస్ఎఫ్సీ విభజన, సింగరేణి కార్పొరేషన్‌తో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజన, ఢిల్లీ ఏపీ భవన్ విభజన, విభజన చట్టంలో పొందుపర్చిన ప్రకారం పన్ను బకాయిలు, బ్యాంకు డిపాజిట్లలో మిగిలిన నగదు పంపకాల అంశాలు ఎజెండాలో ఉన్నాయి.
విభజన చట్టంలోని హామీల అమలు సహా ఇతర అంశాలు, వాటి పురోగతిపైనా సమావేశం చర్చించనుంది. సమావేశంలో చర్చించేందుకు మరో పది అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది.