శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 8 డిశెంబరు 2021 (18:05 IST)

పైసా వసూల్... సెటిల్మెంట్ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి: సాకే శైలజనాథ్

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పాద యాత్రలో ఇచ్చిన హామీలను మరిచి సెటిల్మెంట్ సీఎంగా మారారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గూడు కల్పిస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ ఇళ్లను సెటిల్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు. నవరత్నాలు అంటూ ప్రజలకు జగన్ రెడ్డి ప్రభుత్వం అర చేతిలో వైకుంఠం చూపుతోందని ఆరోపించారు. పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ  తప్పక పోరాటం కొనసాగిస్తుందని, డిసెంబర్ 10న ఓ టీ ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 
 
 
ఓ టీ ఎస్ వసూళ్ల లక్ష్యం రూ.4వేల కోట్లు అని,  స్వచ్ఛందంగా అమలు చేయాలనుకుంటే ఇలా టార్గెట్లు ఎందుకు పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఒక్కో రెవెన్యూ డివిజన్ నుంచి రోజుకు కనీసం కోటి రూపాయలు ఓటీఎస్ కింద వసూలు చేయాలని లక్ష్యం పెట్టారని, గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, సెర్ప్, మెప్మా ఇలా క్షేత్రస్థాయిలో ఇన్ని విభాగాల సిబ్బంది ‘పైసా వసూల్’లో పడ్డారని, టార్గెట్లు అందుకోలేకపోతే చర్యలు తప్పవని పై అధికారులు హెచ్చరిస్తున్నారని శైలజనాథ్ ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో పేదలకు ఇచ్చిన హామీలు మరచిపోయి  అధికారంలోకి రాగానే బకాయిల మాఫీ సంగతి పక్కనపెట్టి, వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద పల్లెల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు కడితే ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించే పథకాన్ని తీసుకువచ్చి దీనికి ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ అని పేరు పెట్టారని విమర్శించారు. 
 
 
‘బలవంతమేమీ లేదు. అంతా స్వచ్ఛందమే’ అని సర్కారు కొత్త పల్లవి అందుకుందని, 1983 నుంచి 2011 మధ్య కాలంలో 51 లక్షల మంది వివిధ పథకాల కింద ఇళ్లు పొందారని, ఆ లబ్ధిదారులు ప్రభుత్వానికి రూ.14 వేల కోట్లు బకాయిలున్నారని, ఇందులో రూ.10 వేల కోట్లు మాఫీ చేసి, వన్టైమ్ సెటిల్మెంట్ కింద రూ.4 వేల కోట్లు మాత్రమే వసూలు చేస్తున్నామని, ఇది బంపర్ ఆఫర్ అని ఊరిస్తున్నారని విమర్శించారు.
 
 
పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో నాటి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి డా వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ స్వగృహ అనే సంస్థను ఏర్పాటు చేసి, ఇళ్లు కట్టించి పెడితే, ఇప్పుడు వాటన్నిటినీ అమ్మేయాలని కుమారుడు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మొత్తం ఇళ్లు అమ్మేసి, తద్వారా ఎంత వీలైతే అంత ఆదాయం తెచ్చిపెట్టాలని అధికార యంత్రాంగానికి టార్గెట్ విధించిందని, అందుకు అనుగుణంగా రంగంలోకి దిగిన రాజీవ్ స్వగృహ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన, సగం పూర్తయిన, అసలు మొదలే కాని అన్ని కేటగిరీల ఇళ్లు, స్థలాలు అమ్మేసేందుకు నోటిఫికేషన్లు జారీచేస్తున్నారని, శైలజనాథ్ వెల్లడించారు. ఈ అమ్మకాల ద్వారా సుమారు రూ.1500 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారని అన్నారు.
 
 
వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వమే చౌకధరలతో ఇళ్లు నిర్మించి ఇచ్చే లక్ష్యంతో 2007లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటుచేశారని, రాష్ట్రవ్యాప్తంగా 5,700ఎకరాల భూమిని సమీకరించారని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వివిధ స్థాయుల్లో ఇళ్లు నిర్మించడం మొదలుపెట్టారని తెలిపారు. అందుకోసం ప్రజలు దరఖాస్తు చేసుకోగా, రిజిస్ర్టేషన్ ఫీజు రూ.5వేలు, నిర్మాణ వ్యయంలో 25శాతం నగదు ముందుగానే తీసుకుని ఇళ్లు కేటాయించారని, కానీ 2009లో ఈ ప్రాజెక్టులన్నీ దాదాపుగా అటకెక్కాయని, అప్పటివరకూ నిర్మాణాలు వేగంగానే జరిగినా ఆ తర్వాత ఆగిపోయి లబ్ధిదారులు తమ నగదు చెల్లించాలంటూ కోరుతూ రాగా చాలాకాలం తర్వాతగానీ డబ్బు వారికి అందలేదని పేర్కొన్నారు.  
 
 
అప్పుల కోసం తిప్పలు పడుతున్న జగన్ ప్రభుత్వం దృష్టి తాజాగా స్వగృహ ఇళ్లపై పడిందని, అసలు మొత్తం అమ్మేస్తే ఎంత వస్తుందనే లెక్కలు వేసి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3వేలకు పైగా ఇళ్లను అమ్మితే రూ.1500 కోట్లు వస్తుందని అంచనా వేశారని,  ఆ వెంటనే అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం వన్టైమ్ సెటిల్మెంట్ జీవో ను వెనక్కు తీసుకోవాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.