గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 24 డిశెంబరు 2021 (18:06 IST)

చేనేతపై జిఎస్టి పెంపు సరికాదన్న మురుగుడు, చిల్లపల్లి

చేనేత ఉత్పత్తులపై జిఎస్టి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త‌గా తీసుకువచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు శాసన పరిషత్తు సభ్యుడు మురుగుడు హనుమంతరావు, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు తెలిపారు. చేనేత రంగ సమస్యల పరిష్కార సమాలోచనలో భాగంగా ఆప్కో ఎండి చదలవాడ నాగరాణితో కలసి విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో వీరు సమావేశమయ్యారు. 
 
 
మురుగుడు హ‌నుమంత‌రావు గతంలో ఆఫ్కో చైర్మన్ వ్యవహరించగా, చేనేత రంగం పట్ల ఉన్న అవగాహనను సద్వినియోగం చేసుకునే క్రమంలో చిల్లపల్లి ఈ సమావేశం ఏర్పాటు చేసారు.  ఈ సందర్భంగా మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ, జిఎస్టి పెంపు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందమేనన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చేలా ప్రయత్నించవలసి ఉందన్నారు. జాతీయ చేతి వృత్తుల అభివృద్ది సంస్ధ బైలా ప్రకారం నూలు సబ్సిడీ ప్రయోజనాలు కార్మికులకు నేరుగా అందేలా ప్రయత్నించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 
 
 
మాస్టర్ వీవర్స్ కు కూడా  నూలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్న దిశగా చర్చించారు. నేతన్న నేస్తం ద్వారా  ప్రతీ ఏటా ఇరవైనాలుగు వేల రూపాయిలు కార్మికులు లబ్ది పొందుతుండగా, వారు తయారు చేసిన చేనేత ఉత్పత్తులను పూర్తి స్ధాయిలో కొనుగోలు చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది. ఆప్కో ఎండి నాగరాణి మాట్లాడుతూ, నూతనంగా ఏర్పాటు చేస్తున్న షోరూంలకు మంచి స్పందన లభిస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త షోరూంలు ఏర్పాటు చేస్తామని వివరించారు.