కోల్ మైనింగ్‌లో ఎపిఎండిసి మరో ముందడుగు
కోల్ మైనింగ్‌లో ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి) మరో ముందడుగు వేసింది. మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గు గనిలో మైనింగ్ కార్యక్రమాలకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన ఎపిఎండిసి ఇతర రాష్ట్రాల్లో కోల్ మైనింగ్ కార్యక్రమాలను నిర్వహించే స్థాయికి చేరి, సాంకేతికతతో తన సామర్థ్యంను చాటుకుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఈ వారంలోనే సుల్యారీ బొగ్గుగనుల తవ్వకం పనులు ప్రారంభమవుతాయని, నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి మొదలవుతుందని తెలిపారు. సుల్యారీ బొగ్గుగనుల కోసం 1298 హెక్టార్ల భూమిలో, 2000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును దాదాపు 22 సంవత్సరాల పాటు వెలికితీసేందుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ కోల్‌మైనింగ్ వల్ల నిర్వాసితులవుతున్న 1250 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నామని అన్నారు. అలాగే ఈ గనుల ద్వారా వెలికితీసే మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 25 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు రిజర్వు చేయటం జరుగుతుందని అన్నారు.
బైరటీస్ మైనింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్‌ను సృష్టించుకున్న ఎపిఎండిసి ఇకపై ఇతర రాష్ట్రాల్లో కూడా మైనింగ్ కార్యకలాపాలకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, తన పరిధిని మరింత విస్తరించేందుకు కృషి చేస్తోందని ఎపిఎండిసి విసి అండ్ ఎండి విజి వెంకటరెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే చత్తీస్‌గఢ్ లోని మదన్‌పూర్ సౌత్ బ్లాక్, జార్ఘండ్ లోని బ్రహ్మదియా కోకింగ్ కోల్ బ్లాక్ లను ఎపిఎండిసి దక్కించుకుందని, ఈ ఏడాదిలో ఇవి కూడా ఉత్పత్తిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
అంతేకాకుండా గ్రానైట్, సిలికాశాండ్, కాల్సైట్ ఖనిజాల వెలికితీత, మార్కెటింగ్‌పై కూడా దృష్టి సారించామని, దీనికి గానూ ఎపిఎండిసి కార్యాచరణను సిద్దం చేసిందని వెల్లడించారు. ప్రస్తుతం ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఆర్జిస్తున్న ఆదాయాన్ని మల్టీలెవల్ టాస్క్ మైనింగ్ పద్దతుల ద్వారా అయిదు రెట్లు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.