మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 2 ఆగస్టు 2021 (21:14 IST)

ఎక్కడైనా ప్రభుత్వం రోడ్లు తవ్వుతుందా?: సూటిగా ప్రశ్నించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

తాడేపల్లి: రాజధానిలో ప్రభుత్వం రోడ్లు తవ్వుతోందంటూ కొన్నాళ్లుగా టీడీపీ చేస్తున్న ప్రచారంపై మెలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ధీటుగా సమాధానం చెప్పారు. అలాగే ఒకటో తేదీన ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడం లేదన్న నారా లోకేష్‌ విమర్శలకు ఆయన గట్టిగా బదులిచ్చారు. మరోవైపు కొండపల్లి వద్ద మైనింగ్‌ లీజ్‌ను 2006లో అప్పటి సీఎం వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి గారే ఇచ్చారంటూ టీడీపీ చేసిన విమర్శలు, ఆరోపణలను కూడా మైలవరం ఎమ్మెల్యే నిలదీశారు. అవాస్తవాలు, అబద్ధాల పునాదుల మీద రెండేళ్ల నుంచి టీడీపీ పని చేస్తోందన్న ఆయన, నిజాలు చెప్పి, తప్పులు చూపించి ప్రజల విశ్వాసం పొందాలి కానీ, ఇలా అబద్ధాలు ప్రచారం చేయడం కాదని స్పష్టం చేశారు.
 
ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇంకా ఏమన్నారంటే..:
మీ నిర్వాకం వల్లనే..:
‘రాజధానిలో రోడ్లు తవ్వారని నిన్న ఇవాళ విమర్శిస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వం రోడ్లు తవ్వుతుందా? ఆనాడు మీరు పూర్తిగా నాసిరకం పనులు చేశారు. చాలా రోడ్లు సగంలో వదిలేశారు. వాటిని ఇవాళ సాక్షి ప్రచురించింది కూడా. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద వేసిన రోడ్లు రాళ్లు తేలాయి. రాజధానిలో రోడ్లు నాసిరకంగా వేశారు. అందుకే తేలిపోయాయి’.
 
మీకా అర్హత లేదు:
‘1వ తేదీన పెన్షన్‌ ఇవ్వడం లేదని లోకేష్‌ విమర్శిస్తున్నారు. మీరా పెన్షన్ల గురించి మాట్లాడేది. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చేయలేదు. రూ.1000 చొప్పున కేవలం 33 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ ఇచ్చారు. కానీ ఆనాడు పెన్షన్‌కు అర్హులు దాదాపు 44 లక్షలు ఉన్నా, ఇవ్వలేదు. జగన్‌ గారు రూ.2 వేల పెన్షన్‌ ఇస్తామని ప్రకటిస్తే, ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు రెండు వేల పెన్షన్‌ ఇచ్చారు’.
 
అందుకే వాత పెట్టారు:
‘ఏదైనా ఒంతుకు గంతేస్తే కొర్రు కాల్చి వాత పెట్టడం ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే మీకు వాత పెట్టారు’. ‘రాష్ట్రంలో కిలో బియ్యం రెండు రూపాయలకు అంటే ఎన్టీఆర్‌ను, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎవరిచ్చారంటే రాజశేఖర్‌రెడ్డి గారిని, లక్షలాది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు ఎవరు కట్టిస్తున్నారంటే జగన్‌ గారిని గుర్తు చేస్తారు. మరి చంద్రబాబును ఏమని గుర్తిస్తారు. రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పినందుకా?’. 
‘పెంచిన పెన్షన్‌ ఒకటో తేదీనే ఇంటి తలుపు తట్టి ఇస్తున్నారు.
 
ఆదివారం అయినా కూడా ఒకటో తేదీన 80 శాతం పెన్షన్లు ఇచ్చింది శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అమ్మ  ఒడి, చేయూత, రైతు భరోసా.. వంటి ఏ ఒక్క పథకాన్ని ఆపడం లేదు. కాబట్టి మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు’.
 
మేము మోసం చేయలేం:
‘కానీ ఎల్లో మీడియా ఏం రాస్తోంది. రాష్ట్రం అప్పులపాలవుతోందని. రాష్ట్రానికి అప్పు కూడా పుట్టడం లేదని. మీ మాదిరిగా అబద్ధాలు ఆడడం, ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపి ప్రజలను మోసం చేయడం సీఎం గారికి చేతకాదు. స్పిన్నింగ్‌ మిల్లులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని సీఎం గారిని అడిగితే, పాజిటివ్‌గా స్పందించారు. స్పిన్నింగ్‌ మిల్లులకు కూడా ఎంఎస్‌ఎంఈల జాబితాలో చేర్చి, ఈనెల 27న సహాయం చేస్తామని చెప్పారు’.
 
‘అదే చంద్రబాబు హయాంలో స్పిన్నింగ్‌ మిల్లులకు డబ్బు విడుదల చేస్తామని చెప్పి, అసోసియేషన్‌ నుంచి రూ.9 కోట్లు తీసుకుని, ఇద్దరు మంత్రులు, మాట నిలబెట్టుకోకుండా చివరి వరకు సాగదీసి, అధికారం నుంచి గద్దె దిగిపోయారు’. ‘అవాస్తవాలు, అబద్ధాల పునాదుల మీద రెండేళ్ల నుంచి టీడీపీ పని చేస్తోంది. నిజాలు చెప్పి, తప్పులు చూపించి ప్రజల విశ్వాసం పొందాలి కానీ, ఇలా అబద్ధాలు ప్రచారం చేయడం కాదు’.
 
1994లోనే లీజ్‌కు..:
‘ఇక కొండపల్లి లోయ వద్ద లేని సర్వే నెంబర్‌ రాజశేఖర్‌రెడ్డి గారు 2006 తర్వాత పుట్టించారని చెబుతున్నారు. నిజానికి 1993లో ఒకరు దరఖాస్తు చేసుకోగా, 1.2.1994లో 143 సర్వే నెంబరు మీద మైన్స్‌ శాఖ లీజు మంజూరు చేసింది. లోయ గ్రామం వద్ద ఒక హెక్టారులో కంకర తవ్వకానికి అనుమతి ఇచ్చారు. అయితే లేని సర్వే నెంబర్‌ను వైయస్సార్‌గారు ట్యాంపర్‌ చేశారని కోర్టు చెప్పిందని పట్టాభి ఆరోపించారు. కానీ అది అవాస్తవం’.
 
1943 నుంచి అవే రికార్డులు:
‘‘ఈ సర్వే నెంబరు గుట్ట పొరంబోకుది అని కూడా ఉంది. మళ్లీ అదే లీజ్‌ను 2005లో రెన్యువల్‌ చేశారు. అయితే అసలు 143 సర్వే నెంబరు లేదని టీడీపీ ప్రతినిధి పట్టాభి విమర్శించారు. 1943–44లో ఆర్‌ఎస్‌ఆర్‌ చివరి సర్వే నెంబర్లు.. 141 నుంచి 143 వరకు ఇంక్‌పెన్‌తో రాయగా, దాన్నే రికార్డుల్లో నమోదు చేస్తూ వచ్చారు. వాస్తవం ఇలా ఉంటే, వైయస్సార్‌ గారి హయాంలో లేని సర్వే నెంబరు రాశారని పట్టాభి ఆరోపించారు’.
 
దేవినేని ఉమ రిబ్బన్‌ కట్టింగ్‌:
‘2016, డిసెంబరు 4న అప్పటి మంత్రి దేవినేని ఉమ అక్కడ ఒక క్రషర్‌ ప్రారంభించారని నేను చెబితే, నిన్న పట్టాభి అన్నాడు.. ఆరోజు దేవినేని అక్కడికి కేవలం ఇన్‌స్పెక్షన్‌ కోసమే వెళ్లాడని. నిజానికి ఆ క్రషర్‌ ప్రారంభోత్సవాన్ని మర్నాడు ఈనాడు పత్రికలో కూడా ప్రచురించారు. నిజంగా దేవినేని ఉమ తనిఖీ కోసం వెళ్తే ఆయనకు ఘన స్వాగతం పలుకుతారా. పూలు చల్లుతారా’.
 
అన్నీ అబద్ధాలు:
‘అలాగే పట్టాభి ఒక జడ్జిమెంట్‌ను ప్రస్తావించాడు. అది అబద్ధం. వైయస్సార్‌ గారు లేని సర్వే నెంబర్‌ను ట్యాంపర్‌ చేశారన్నది కూడా అవాస్తవం. నిజాన్ని ఆయుధంగా చేసుకుని పని చేయమని చంద్రబాబునాయుడు గారు చెప్పారట. మరి నిజంగా అలా పని చేస్తే.. 1994లోనే 143 సర్వే నెంబర్‌లో అక్కడ లీజ్‌కు ఇస్తే, 2006లో వైయస్సార్‌గారు లేని సర్వే నెంబర్‌ను సృష్టించారని ఎలా చెబుతున్నారు. 45 ఏళ్లుగా అక్కడ మైనింగ్‌ జరుగుతోంది. అన్ని ప్రభుత్వాలు లీజ్‌కు ఇచ్చి, రాయల్టీ కూడా పొందాయి. అక్కడ విద్యుత్‌ సదుపాయం కూడా కల్పించారు’.
 
లేని విషయాన్ని ఆపాదిస్తారా?:
‘లేని విషయాన్ని నిజం చేయాలని ఏడాదిగా దేవినేని ఉమ చేస్తున్న ప్రయత్నాన్ని మీరంతా సమర్థిస్తారా. నన్ను తప్పు పడతారా. 1943–44లో జరిగిన లీజ్‌ వ్యవహారాన్ని వైయస్సార్‌ గారికి ఆపాదిస్తారా. అబద్ధాన్ని ఆయుధంగా చేసుకుని బతుకుతున్నారు’.
 
ఆయనకు తిండి యోగం:
‘నేను 10 వరకే చదివానని చెప్పాను. అదే విషయాన్ని నా అఫిడవిట్‌లో కూడా ప్రస్తావించాను. చదువు అందరికి అబ్బదు. నాకు సరస్వతి యోగం లేదు. కానీ లక్ష్మీ యోగం కలిగింది. ఇవాళ రాజయోగమూ కలిగింది. కానీ పట్టాభి నీకు తిండియోగం తప్ప ఏదీ లేదు. టీడీపీ ఆఫీసులో వేసే ముష్టి తిని మాట్లాడుతున్నావు’.
 
మీ వల్ల కమ్మ జాతికి నష్టం:
‘అబద్ధాల పత్రికలు, ఛానళ్ల వల్ల కమ్మ జాతికి నష్టమే తప్ప, లాభం లేదు. లేనిపోనివి చూపించి, మా లాంటి వారిని తగ్గించి చూపడం తప్ప, మీరు ఏం సాధించారు. నేను చాణక్య జూనియర్‌ కాలేజీ, పంజగుట్టలో చదివాను. కానీ ఇంటర్‌ పూర్తి చేయలేదు కాబట్టి, పదవ తరగతి వరకే చదివానని చెబుతాను’.
 
ఆ విమర్శకు కట్టుబడి ఉన్నాను:
‘లోకేష్‌ను నేను ఏదో అన్నానని పట్టాభి విమర్శించాడు. మొన్న లోకేష్‌ను అన్న మాటలకే ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. నాకు తెలుసు. నేను మాట్లాడిన పదాలను లోకేష్‌ అస్సలు పలకలేడు. లోకేష్‌ మంగళగిరి అని కూడా స్పష్టంగా అనలేడు’. ‘కొడుకు సంగతి ముందే తెలుసు కాబట్టి, లోకేష్‌ కోసం చంద్రబాబు హెరిటేజ్‌ కంపెనీ పెట్టాడు. తన కొడుకు రాజకీయాలకు పనికి రాడని చంద్రబాబుకు తెలుసు కాబట్టి, వ్యాపారం పెట్టించాడు. అలాగే భవిష్యత్తులో ఎవరైనా విమర్శిస్తారని తెలిసి, సత్యం రామలింగరాజు డబ్బులతో విదేశాల్లో చదివించాడు’.
 
పార్టీని కాపాడుకోలేకపోయారు:
‘ఏడాదిన్నర నుంచి హైదరాబాద్‌లో కూర్చుని పిల్లవాడితో ఆడుకుంటున్నారు. దానికి బదులుగా పార్టీ ఆఫీసులో కూర్చుని, పార్టీని కాపాడుకోవచ్చు కదా? తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ కూడా పార్టీని వీడిపోయాడు. తన తర్వాత పార్టీ పోతుందని ఆనాడు ఎన్టీఆర్‌ చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది. లోకేష్‌ వల్ల పార్టీ ఉనికి లేకుండా పోతుంది’. ‘ఏబీఎన్‌ రాధాకృష్ణ, పట్టాభి, లోకేష్‌ వంటి వారు పార్టీలోకి రావడంతో దానికి పుట్టగతులు లేకుండా పోతోంది. ఒకవైపు పూర్తిగా పతనం ప్రారంభం. తెలంగాణలో కమ్మ కులస్తులకు విషయం అర్థమైంది. ఇంకా అర్ధం కావాల్సింది ఇద్దరికే. ఒకరు అమెరికాలో ఉన్న కమ్మ కులస్తులు. రెండోది ఆంధ్రలో ఉన్న కమ్మ కులస్తులు’.
‘అమెరికాలో ఉన్న వారేమో చంద్రబాబు మాటలు నమ్ముతున్నారు. ఇక్కడేమో ఆంధ్రజ్యోతి, ఈనాడును నమ్ముతున్నారు. ఎక్కడైనా ఎవరైనా ప్రజలతో కలిసి ఉంటేనే మనగలుగుతారు. అప్పుడే పార్టీ బతుకుతుంది’.
 
దిగజారుడు రాజకీయాలు:
‘జి.కొండూరు వద్ద కారులో కూర్చున్న దేవినేని ఉమ, అక్కణ్నుంచే పార్టీ నాయకులతో మాట్లాడి, అందరినీ రెచ్చగొట్టి, 5 గంటల పాటు డ్రామా చేశారు. వైయస్సార్‌సీపీ నాయకుడి కారు మీదే దాడి జరిగితే, అబద్ధాలు చెప్పి, దేవినేని ఉమ మీదే జరిగిందని ప్రచారం చేస్తున్నారు. ఇంకా దిగజారిన ఆంధ్రజ్యోతి అక్కడ వేల కోట్ల మైనింగ్‌ చేశారని నిన్న కూడా సిగ్గు లేకుండా రాసింది. నేను రూ.5 కోట్ల డబ్బులు తీసుకుని, ఆర్డర్‌ ఇప్పించానని నిస్సిగ్గుగా ఆరోపించారు’. ‘ఇది 17.10.2019న అప్పటి స్పెషల్‌ సీఎస్‌ మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన సమగ్ర నివేదిక. పాత నివేదికలు టీడీపీ హయాంలో ఇచ్చిన వాటన్నింటినీ క్రోడీకరించి ఒక సమగ్ర నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం 143 సర్వే నెంబరు లీజ్‌ గురించి ఉంది’.
 
ఎవరు అసలు వీరప్పన్‌?:
‘కాబట్టి అబద్ధాని నిజం చేయాలని దేవినేని ఉమ వంటి నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు. నేను వీరప్పన్‌ను కాదు. దేవినేని ఉమనే వీరప్పన్‌ కాదా. అక్కడ క్రషర్‌ ప్రారంభించడానికి దేవినేని స్వయంగా వెళ్తే, అక్కడ తనిఖీ కోసం మంత్రి దేవినేని వెళ్లాడని సిగ్గు లేని పట్టాభి చెబుతున్నాడు. నాడు అక్రమ మైనింగ్‌ కోసం జీఓలు ఇప్పించిన దేవినేని ఉమ వీరప్పనా లేక వసంత కృష్ణప్రసాద్‌ వీరప్పనా.. సిగ్గు లేని పట్టాభి చెప్పాలి’.
 
అవేవీ రుజువు కాలేదు:
‘2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మా బంధువులు ఒకరి హత్య కేసులో నాపె సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ వేశారు. నేను న్యాయ పోరాటం చేశాను. ఆ కేసును 2016లో కొట్టేశారు’. ‘ఇంకా 2014లో జగన్‌ గారిపై కేసుల పరంపరంలో భాగంగా, నేను కొండాపూర్‌ వద్ద వసంత వ్యాలీ ప్రాజెక్టు చేస్తుంటే, పక్కన ఇందు ప్రాజెక్టు వారు దారి కోసం నా దగ్గర భూమి తీసుకున్నారు. అందుకు బదులుగా నాకు 50 శాతం షేర్‌ ఇస్తే, ఇందూ ప్రాజెక్టు మీద కేసులు పెడుతూ, నా పేరు చేర్చారు. అలా సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేయగా, నేను వెంటనే హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశాను. కానీ ఇప్పటి వరకు వాటి విచారణ జరగలేదు. కాబట్టి వెంటనే వాటి విచారణ జరగాలని నేను కోరుతున్నాను. అవసరమైతే మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తాను’.
 
‘అయినా దాన్ని పట్టుకుని దేవినేని ఉమ నాపై వందలసార్లు ఆరోపణ చేశారు. నేను సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్నానని. కాబట్టి క్వాష్‌ పిటిషన్లపై వెంటనే విచారణ జరగాలని కోరుకుంటున్నాను’.. వసంత కృష్ణప్రసాద్‌ ప్రెస్‌ మీట్‌ ముగించారు.