గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 13 నవంబరు 2021 (12:14 IST)

ఏపీ ప్ర‌భుత్వానికి ఉద్యోగ సంఘాల జేఏసీ డెడ్ లైన్!

ఈ నెలాఖరులోగా  ప్రభుత్వం పిఆర్సీ అమలు  చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి ఉద్యోగ  సంఘాల  జేఏసీ డెడ్ లైన్ విధించింది. లేకపోతే  కార్యాచరణ  ప్రకటిస్తామ‌ని, ఉద్యమాల వరకు దయచేసి తీసుకు రావద్దు అని ఏపీ  ఉద్యోగ  సంఘాల  జేఏసీలు విన్న‌వించాయి.
 
 
ఏపీజేఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం వచ్చాక త‌మ‌కు ఒక్క డీఏ కూడా రాలేద‌న్నారు. పీఆర్సీ నివేదిక కూడా మాకు ఇవ్వలేదు... మేం అధికారంలోకి వస్తే, వారంలోనే సీపీఎస్ రద్దు  అన్నారు. ఇప్పటికీ సీపీఎస్ రద్దు కాలేదు... కమిటీలు కాలయపనకే గానీ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం కాద‌ని నిరాశ‌ను వ్య‌క్తం చేశారు. పీఆర్సీ నివేదికపై అధికారుల కమిటీ పరిశీలన పై మాకు నమ్మకం లేద‌ని, ఉద్యోగుల ఇచ్చిన హెల్త్ కార్డ్ అనారోగ్య కార్డుగా మారింద‌ని ఎద్దేవా చేశారు. 
 
 
ఈ నెల 27 న ఏపీఎన్జీవో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశామ‌ని, ఈ నెల 28న రెండు జేఏసీ ల సమావేశం ఏర్పాటు చేశామ‌ని బొప్ప‌రాజు తెలిపారు. దానిలో త‌మ‌ భవిష్యత్ కార్యాచరణ
ప్రకటిస్తామ‌ని, మేము పోరుబాట పట్టేలా ప్రభుత్వ చర్యలున్నాయ‌ని అన్నారు. 
 
 
ఏపీ  జేఏసీ  కార్యదర్శి హృదయ రాజు మాట్టాడుతూ, కారుణ్య  నియామకాలు విషయంలో ప్రభుత్వం  దృష్టి పెట్టాల‌ని, నియమకాలపై సవరణలు చెయ్యాల‌న్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి వెంటనే  నిర్ణయం తీసుకోవాల‌ని డిమాండు చేశారు. చరిత్ర  కలిగిన సంఘాలు పిఆర్సీ నివేదిక బయట పెట్టాలని అడుగుతున్నామ‌ని చెప్పారు.