శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (16:26 IST)

ఇక ఏడుకొండ‌ల స్వామి ద‌ర్శ‌నం ఎంతో సుళువు... ఒక్క రోజులోనే...

విజ‌య‌వాడ నుండి వినూత్న ప్యాకేజీకి రూప‌క‌ల్ప‌న చేసిన ఆంధ్రప్రదేశ్ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్ధ‌. ప్రారంభ‌మైన ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌, ఉగాది నుండి బ‌స్సు ప్రారంభం.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ది సంస్థ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి (విజ‌య‌వాడ‌) వాసుల‌కు అధ్బుత‌మైన దేవాల‌య సంద‌ర్శ‌న ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. మునుపెన్న‌డూ లేని విధంగా ఒక్క‌రోజులోనే తిరుమ‌ల శ్రీ‌వెంక‌టేశ్వ‌రుని ద‌ర్శ‌నంతో పాటు,  శ్రీ‌నివాస మంగాపురం, తిరుచానూరు, శ్రీ‌కాళ‌హ‌స్తి దేవాల‌యాల‌ను ద‌ర్శించేలా ఈ ప్యాకేజ్‌కు రూప‌కల్ప‌న చేసిన‌ట్లు ఎపిటిడిసి ఎండి ధ‌నుంజ‌య‌రెడ్డి తెలిపారు. 
 
తొలిరోజు రాత్రి ప‌ది గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లో ప్రారంభం అయ్యే ఈ తిరుమ‌ల సంద‌ర్శ‌న ప‌ర్య‌ట‌న మూడోరోజు ఉద‌యంతో ఐదు గంట‌ల‌కు విజ‌య‌వాడ చేర‌టంతో ముగుస్తుంది. ఈ ప్యాకేజీ ధ‌ర‌ను పెద్ద‌ల‌కు 3,775 రూపాయ‌లుగా నిర్ణ‌యించ‌గా, పిల్ల‌ల‌కు 3,000 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. ప్ర‌ధాన పిక‌ప్ పాయింట్‌గా స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ఎదురుగా ఉన్న ఎపిటిడిసి సెంట్ర‌ల్ రిజ‌ర్వేష‌న్ కార్యాల‌యాన్ని నిర్ణ‌యించ‌గా, బ‌స్సు ఆటోన‌గ‌ర్‌లోని ప‌ర్యాట‌క కార్యాల‌యం నుండి ప్రారంభ‌మై ప‌ట‌మ‌ట‌, బెంజ్ స‌ర్కిల్‌, ల‌బ్బీపేట త‌దిత‌ర ప్ర‌ధాన ప్రాంతాల‌లో ఉన్న ప‌ర్యాట‌కుల‌ను కూడా పిక‌ప్ చేసుకుంటుంది. 
 
ఈ ప్యాకేజీలో రెండు గంట‌ల‌లో పూర్తి అయ్యే స్వామివారి ప్ర‌త్యేక ద‌ర్శ‌నంతో పాటు, నాణ్య‌త‌తో కూడిన అల్పాహారం, మ‌ధ్యాహ్న‌, రాత్రి భోజ‌నాలు, శ్రీ‌నివాస‌మంగాపురం, తిరుచానూరు, శ్రీ‌కాళ‌హ‌స్తి దేవాల‌యాల‌లో ప్ర‌త్యేక ద‌ర్శ‌నం, రెండు లీట‌ర్ల బాటిల్ మంచినీరు, శ్రీ‌కాళ‌హ‌స్తిలో బ‌స మిళిత‌మై ఉన్నాయి. ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను వివ‌రించిన ధ‌నుంజ‌య‌రెడ్డి ఉగాది ప‌ర్వ‌దినం రోజు ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకు రానున్నామ‌ని, దైవ ద‌ర్శ‌నం కోసం బారులు తీరే ప‌నిలేకుండా ప‌ర్యాట‌క శాఖ అన్ని ఏర్పాట్ల‌తో ఈ ప‌ర్య‌ట‌న‌ను సిద్దం చేసింద‌న్నారు. 
 
తిరుప‌తి నుండి ఉద‌యానికి కాళ‌హ‌స్తి చేరుకునే ప‌ర్యాట‌కులు అక్క‌డ అల్పాహారం త‌దుప‌రి తిరుప‌తి చేరుకుంటార‌ని, అక్క‌డ బ‌స్సు మారి తిరుమ‌ల వెళ్లి మ‌ధ్యాహ్నం లోపు ద‌ర్శ‌నం ముగించుకుని తిరుప‌తి చేరుకుంటార‌ని, భోజ‌న విరామం అనంత‌రం శ్రీ‌నివాస మంగాపురం, తిరుచానూరుల‌లో ద‌ర్శ‌నం పూర్తి చేసుకుని సాయంత్రం ఆరుగంట‌ల ప్రాంతంలో శ్రీ‌కాళ‌హ‌స్తి చేరుకుంటార‌న్నారు. ద‌ర్శ‌నం, రాత్రి భోజ‌నం అనంత‌రం విజ‌య‌వాడ ప‌య‌నం అవుతార‌ని ఎమ్‌డి పేర్కొన్నారు. 
 
విజ‌య‌వాడవాసుల నుండి ఈ ప్యాకేజ్ టూర్‌కు సంబంధించి మంచి స్పంద‌న ల‌భిస్తుంద‌ని, ఇప్ప‌టికే ప్రారంభం అయిన ఆన్‌లైన్ విక్ర‌యాలు దానిని స్ప‌ష్ట‌ప‌రుస్తున్నాయ‌న్నారు. ప‌ర్య‌ట‌న కోసం ఆధునిక వోల్వో బ‌స్సును ఎపిటిడిసి స‌మ‌కూర్చుకుంద‌ని ధ‌నుంజ‌య‌రెడ్డి వివ‌రించారు.  ప్ర‌యాణీకుల భ‌ద్ర‌త‌కు కూడా పెద్దపీట వేస్తున్నామ‌ని, రోజు మార్చి రోజు ఈ స‌ర్వీసు అందుబాటులో ఉంటుంద‌ని, భ‌క్తుల ర‌ద్దీ పెరిగితే అన్ని రోజులు ఈ సేవ‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్నారు. టూరిజం వెబ్‌సైట్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌ర్యాట‌క‌ శాఖ రిజ‌ర్వేష‌న్ కేంద్రాలు, టోల్ ఫ్రీ నెంబ‌ర్ 180042545454 ద్వారా మ‌రింత స‌మాచారం పొంద‌వ‌చ్చ‌న్నారు.