శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Modified: మంగళవారం, 16 నవంబరు 2021 (20:26 IST)

ఓడే బాబుకు.. కుప్పం ప్రజలు దొంగ ఓటర్లా?

కుప్పంలో దొంగ ఓట్లు అంటూ చంద్రబాబు, టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం అంతా వారు సృష్టించిన కట్టుకథలే... అని లోక్ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఫ్లోర్ లీడర్ శ్రీ పీవీ మిథున్ రెడ్డి విమర్శించారు. వారు ఆరోపిస్తున్నట్టుగా కుప్పంలో దొంగ ఓట్లు వేస్తే..  మునిసిపాలిటీలోని 48 పోలింగ్ బూత్ లలో ఏ ఒక్క టీడీపీ ఏజెంటు అయినా ఫిర్యాదు చేశారా అని సూటిగా ప్రశ్నించారు.


ఫలానా పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు వేశారని, అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు ఎన్నికలు కమిషన్ కు ఫిర్యాదు చేస్తే.. ఆ బూత్ ల లో ఏం అక్రమాలు జరిగాయో, వాస్తవాలేమిటో బయట పెట్టాలని మేం కూడా కమిషన్ ను కోరతామని మిథున్ రెడ్డి చెప్పారు. దొంగ ఓటర్లు అంటూ టీడీపీ, ఎల్లో మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తుల్లో ఏ ఒక్కరి వేలుపైన అయినా సిరా మార్క్ ఉందా అని నిలదీశారు.


దొంగ ఓట్లు వేశారనిగానీ, పోలింగ్ బూత్ లలో అక్రమాలు జరిగాయన్న దాఖలాలుగానీ ఎక్కడా లేవని, ఎటువంటి ఫిర్యాదులూ ఎన్నికల కమిషన్ కు చేయలేదని తెలిపారు. చంద్రబాబు కుప్పం వస్తున్నాడని ప్రచారం చేసి, ఇతర ప్రాంతాల నుంచి ఆ పార్టీ నాయకులను కుప్పానికి తరలించి, భయానక వాతావరణాన్ని సృష్టించి అలజడులు జరిగేలా కుట్రలు పన్నింది టీడీపీనే అని తెలిపారు. కుప్పంలో దొంగ ఓట్ల గురించి అసలు కంప్లైంట్ చేసిందే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు చంద్రబాబు రివర్స్ గేర్ లో మాపైనే ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అన్నారు. 
 
 
మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే...
నిన్న పోలింగ్ జరిగిన కుప్పం మున్సిపాల్టీ ఎన్నికకు సంబంధించి ఏవో అక్రమాలు జరిగాయని, దొంగ ఓట్లు వేశారని.. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీకి వత్తాసు పలికే ఎల్లో మీడియాలో  పెద్దఎత్తున కథనాలు రాశారు.  అవి అన్నీ కట్టుకథలు మాత్రమే.  వైయస్ఆర్సీపీగా మేం ఎటువంటి అక్రమాలకుగానీ, అన్యాయాలకుగానీ పాల్పడలేదు. ప్రతి పోలింగ్ బూత్ లో ఎన్నికల అధికారి దగ్గర గానీ, టీడీపీ ఏజెంట్లు దగ్గరగానీ, వైయస్ఆర్సీపీ ఏజెంట్ల దగ్గరగానీ ఫోటోలతో కూడిన ఓటర్ లిస్టు ఉంది. ఏ బూత్ లో అయినా అక్రమాలు జరిగి ఉంటే, దొంగ ఓట్లు వేసి ఉంటే.. ఒక్క కంప్లైంట్ అయినా చేయాలి, ఎక్కడా ఒక్క కంప్లైంట్ కూడా లేదు. అయినా టీడీపీ, ఎల్లో మీడియా అక్రమాలు, అన్యాయాలు జరిగినట్టు దుష్ప్రచారం చేస్తుంది. 


కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని  48 పోలింగ్ బూత్ లల్లో ఎన్నిక జరిగితే.. ఫలానా వ్యక్తి దొంగ ఓటు వేయడానికి వచ్చాడనిగానీ, ఫలానా బూత్ లో దొంగ ఓట్లు పోల్ అయ్యాయనిగానీ  ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ సీనియర్ నాయకులు ఏజెంట్లుగా కూర్చున్నారు. టీడీపీలోని కీలకమైన వ్యక్తులే అక్కడ అభ్యర్థులుగా పోటీ చేశారు. లోకేష్ సమావేశం పెట్టి, ఇచ్చిన జాబితాలోని వ్యక్తులే టీడీపీ ఏజెంట్లుగా కూర్చున్నారు. ఎక్కడైనా ఒక్క కంప్లైంటు లేదు. ప్రతి బూత్ లో ఏం జరుగుతుందన్నది వెబ్ కామ్ ద్వారా వీడియోలలో రికార్డు అయ్యింది. ఎక్కడా ఎటువంటి అక్రమాలు జరిగి దాఖలాలు లేవు. పోలింగ్ స్టేషన్ల బయట ఎన్నికలప్పుడు జరిగే విధంగా, అక్కడక్కడా  చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. 

 
చంద్రబాబునాయుడిని, టీడీపీని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఫలానా బూత్ లో దొంగ ఓట్లు వేశారు, అక్రమాలు జరిగాయని ఎన్నికల కమిషన్ కు మీరు చెప్పండి. మేం కూడా అదే బూత్ లో ఏం అక్రమాలు జరిగాయో చెప్పాలని మేం కూడా కమిషన్ ను కోరతాం. దొంగ ఓట్లు వేశారనేది కేవలం టీడీపీ, ఆ మీడియా కట్టుకథ మాత్రమే. 


ఓటరు  కాని వ్యక్తి దొంగ ఓట్లు ఎలా వేయగలుగుతాడు..?.  ఓటరు లిస్టులో ఉన్న ఒకరి ఓటును మరొకరు వేయాలి. అలాంటప్పుడు అన్ని పార్టీల ఏజెంట్లు బూత్ లలో ఉంటారు.  లోపల వెబ్ కాస్టింగ్ జరిగినట్టే.. పోలింగ్ స్టేషన్ల బయట కూడా ఎన్నికల కమిషన్ అధికారులు వీడియోలు తీయించడం జరిగింది. ఒక్క బూత్ లో కూడా దొంగ ఓటర్లు వచ్చారని గొడవలు జరిగిన దాఖలాలు లేవు. 

 
టీడీపీ, ఆ పార్టీకి వత్తాసు పలికే ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నట్టు... దొంగ ఓట్లు వేస్తే, ఎక్కడా ఒక్క కంప్లైంట్ అయినా ఎందుకు ఇవ్వలేదు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని తేలిపోయింది. తమిళనాడు- కర్ణాటక బార్డర్ లో కుప్పం ఉంది. బస్టాండ్ నుంచి పట్టుకు వచ్చిన వ్యక్తులను, ఇతర పనుల మీద వచ్చిన ప్రైవేట్ వ్యక్తులను పట్టుకు వచ్చి, వారే  దొంగ ఓటర్లు అని టీడీపీ నానా యాగీ చేసింది. దొంగ ఓట్లు వేస్తే.. వారు ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేయడానికి వస్తే.. టీడీపీ మీడియా చూపించినవారిలో ఒక్కరికన్నా వేలిపై ఇంక్ మార్క్ ఉందా... అంటే లేదు. 

 
చిత్తూరు జిల్లా వాసిగా, ఎవరు దొంగ ఓటర్లు, ఎవరు స్థానికులు అన్నది మాకు పూర్తిగా అవగాహన ఉంది. దొంగ ఓటర్లు అంటూ రోడ్ల మీదకు వచ్చి గొడవలు చేసిన వ్యక్తులంతా మిగతా మండలాలు, ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీపీ సభ్యులు, ఆ పార్టీ నాయకులే. చంద్రబాబు కుప్పం వస్తున్నాడని ప్రచారం చేసి, పోలింగ్ నాడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎల్లో మీడియా ఒక భయానక వాతావరణం సృష్టించారు. బయట ప్రాంతాలకు చెందిన నాయకులను తీసుకొచ్చి, కుప్పంలో అలజడి సృష్టించింది టీడీపీ నేతలే అన్నది వారి టీవీల్లో వచ్చిన వీడియోలు చూసినా అర్థం అవుతుంది. 

 
ఇవన్నీ తెలుగుదేశం  పార్టీ చేసి.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లడం కరెక్టు కాదు. ప్రజలు ఇచ్చే తీర్పును ఎవరైనా స్వాగతించాలి. ఇటువంటి కథనాలు, కట్టుకథలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే చంద్రబాబు గురించి తెలిసిన వారెవరూ నమ్మరుగాక నమ్మరు. దొంగ ఓటర్లంటూ టీడీపీ పట్టుకున్న వ్యక్తులంతా... రామకుప్పం మండలానికి చెందిన టీడీపీ మద్దతుదార్లని తేలినట్టుగా పోలీసులే చెప్తున్నారు. దీన్ని ఏమనుకోవాలి?

 
కుప్పం మున్సిపాలిటీకి ఎన్నిక నిన్న జరిగితే.. గతంలో కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ, పరిషత్ ఎన్నికల్లోనూ ఏం జరిగింది, ఎటువంటి ఫలితాలు వచ్చాయన్నది కూడా విశ్లేషించుకోవాలి. కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం వైయస్ఆర్సీపీ గెలిచింది. పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తున్నామని ప్రకటించి, నామినేషన్లు వేసి, బీ-ఫారాలు ఇచ్చి, డబ్బులు పంచినా.. అందులోనూ వైయస్ఆర్ కాంగ్రెస్  పార్టీ 90 శాతం గెలిచింది.


ఎన్నికలు బహిష్కరిస్తే.. 10 శాతం స్థానాలు టీడీపీ ఎలా గెలిచింది..?
పంచాయతీ, పరిషత్ ఎన్నికలకు భిన్నంగా కుప్పం మున్సిపాలిటీలో ఫలితాలు ఎలా వస్తాయి..? టీడీపీ వస్తాయని చెబితే నమ్మశక్యంగా లేదు. ఎగ్జిట్  పోల్స్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని తెలుసుకుని టీడీపీ, చంద్రబాబు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. 

 
కుప్పంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. జగన్ గారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రతి ఎన్నికలోనూ ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటివరకూ కుప్పం ప్రజలు చంద్రబాబును ప్రతి ఎన్నికల్లోనూ గెలిపించి మేలు చేశారు తప్పితే.. ఆయన మాత్రం కుప్పానికి చేసిందేమీ లేదు. హంద్రీ-నీవా నీళ్ళు కూడా చంద్రబాబు కుప్పం తీసుకు రాలేకపోయాడు. కుప్పంలో చంద్రబాబు కేవలం 1300 పక్కా ఇళ్ళు ఇస్తే.. రెండున్నరేళ్ళలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 వేలకుపైగా మంజూరు చేశాం. హంద్రీ-నీవాలో నీళ్ళ లభ్యత తక్కువ ఉంది కాబట్టి, గాలేరు-నగరితో అనుసంధానం చేసి కుప్పానికి కూడా ముఖ్యమంత్రి జగన్ గారు నీళ్ళు ఇవ్వబోతున్నారు.

 
చంద్రబాబు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ప్రచారం చేసే వాటిల్లో ఇసుమంతైనా నిజం లేదు. ప్రజలు వాస్తవాలు గమనించాలి. ఎన్నికల కమిషన్ ప్రకటన కూడా చూశాం. ఆ ప్రకటనలోనూ ఎక్కడా దొంగ ఓటర్లు వచ్చారనిగానీ, దొంగ ఓట్లు వేశారనిగానీ పేర్కొనలేదు. కుప్పంలో దొంగ ఓట్లు వేస్తారని కంప్లైంట్ చేసింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే.  ఆ నియోజకవర్గంలో 28 వేల దొంగ ఓట్లు ఉన్నాయని గతంలో మేం కంప్లైంట్ ఇస్తే.. ఆరోజుల్లో 18 వేల ఓట్లు తీసేయడం జరిగింది. కుప్పంలో దొంగ ఓట్లకు సంబంధించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేం ఫిర్యాదు చేస్తే.. మా మీద రివర్స్ లో చంద్రబాబు దొంగ ఓట్లు అంటూ విమర్శలు చేస్తున్నారు. కుప్పంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. 

 
ఎలక్షన్స్ సవ్యంగా జరగాలన్నదే మా ఉద్దేశం. కుప్పం నియోజకవర్గం 175 అసెంబ్లీ స్థానాల్లో ఒకటి. కుప్పాన్ని ప్రత్యేకంగా మేం టార్గెట్ చేసిందేమీ లేదు. కుప్పంతో పాటు 175 నియోజకవర్గాల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతాం. ప్రజల మన్ననలు పొంది గెలవాలన్నదే మా లక్ష్యం. కౌంటింగ్ సవ్యంగా జరిగేదానికి కమిషన్ ఏ చర్యలు తీసుకున్నా మేం కూడా స్వాగతిస్తాం. 

 
చంద్రబాబు గత 30 ఏళ్ళుగా పుంగనూరు నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా మాదే విజయం. లోకేష్.. చిన్నా పెద్దా తేడా తెలియకుండా నీచంగా మాట్లాడుతున్నాడు. అంతెందుకు, చంద్రబాబు నాయుడే అంత అనుభవం ఉండి దుర్మార్గంగా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. పార్టీకి అధినాయకుడే అటువంటి పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడుతుంటే.. ఆ పార్టీలో కింది స్థాయి నాయకులు కూడా అలానే తయారయ్యారు. అది మా సంస్కారం కాదు, అటువంటి మాటలు మాట్లాడినా.. వారి విజ్ఞతకే వదిలేస్తాం.