గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (15:41 IST)

గెలిచామని చెప్పుకోవడానికి ఇంత దారుణమా? చంద్రబాబు ప్రశ్న

అన్ని ఎన్నికల్లో తామే గెలుస్తున్నామని చెప్పుకోవడానికి అధికార పార్టీ నేతలు ఇంత దారుణానికి తెగబడుతారా? అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కుప్పం మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో అధికార వైకాపా నేతలు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం అపహాస్యం పాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయబోతున్నారని తాము ముందే చెప్పామని... ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. చివరకు మున్సిపల్ ఎన్నికలను కూడా అపహాస్యంపాలు చేశారని మండిపడ్డారు. 
 
ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని అక్రమాలకు పాల్పడాలా? అని ప్రశ్నించారు. గెలిచామని చెప్పుకోవడానికి ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని చెప్పారు.
 
కుప్పంలో బయట నుంచి వచ్చిన దొంగ ఓటర్లు ఓటు వేస్తున్నారని.. రాత్రి కొందరు దొంగ ఓటర్లను టీడీపీ నేతలు పట్టుకున్నారని చంద్రబాబు తెలిపారు. దొంగలకు వంతపాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్ ఏజంట్లను అరెస్ట్ చేసి వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారని దుయ్యబట్టారు.