మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 జులై 2020 (23:08 IST)

నవంబర్ నాటికి రాష్ట్రం మొత్తం ఆరోగ్యశ్రీ: జగన్

ఆంధ్రప్రదేశ్ లో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకేరోజు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన 1088 అంబులెన్స్ లను ప్రారంభించడం ద్వారా దేశంలోనే కొత్త రికార్డును సృష్టించింది. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, బేసిక్ లైఫ్ సపోర్ట్, నియేనేటల్ పరికరాలతో కూడిన 108 అంబులెన్స్ సర్వీసులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు.

దీనితో పాటు ఈ సర్వీసుల్లో పనిచేస్తున్న సిబ్బందికి సైతం జీతాలను పెంచుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. అలాగే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాట్కోట్రస్ట్, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగంలో పనిచేసే కాంప్రహెన్సీవ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను ఈ నెల 8వ తేదీ నుంచి ఆరు జిల్లాల్లో, నవంబర్ నుంచి రాష్ట్రం అంతటా కూడా మొత్తం 2059 ప్రోసీజర్ లకు వర్తింప చేస్తూ మరో నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. 
 
గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా నాట్కో ట్రస్ట్, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన నూతన కాంప్రహెన్సీవ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ రిమోట్ ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నాట్కో ట్రస్ట్ ఈ క్యాన్సర్ కేర్ సెంటర్ కోసం నిధులను అందించడం పట్ల నాట్కో ట్రస్ట్ సీఎండి నన్నపనేని వెంకయ్య చౌదరి, ఇతర ట్రస్ట్ ప్రతినిధులను అభినందించారు. ప్రజల ఆరోగ్యం కోసం నాట్కో ట్రస్ట్ ఈ రకంగా ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఈ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుతో పేదలకు ఉచితంగానే ఖరీదైన క్యాన్సర్ చికిత్సను అందించడానికి వీలు పడుతుందని అన్నారు.

అలాగే ఈ సెంటర్ కారణంగా రాష్ట్రానికి రెండు పీజీ ఆంకాలజీ రేడియేలజిస్ట్ పోస్ట్ లు కూడా రావడం మరింత సంతోషంను కలిగిస్తోందని అన్నారు. ఈ సెంటర్ ద్వారా మెడికల్, సర్జికల్, రేడియోలజీ సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఎఇఆర్బీ అనుమతి వున్న మొట్టమొదటి యూనిట్ ఇది. ఇటువంటిదే కర్నూల్ లో నిర్మిస్తున్నాం. మరో ఏడాది కాలంలో అదికూడా పూర్తిగా ఆపరేషన్ లోకి వస్తుందని సీఎం అన్నారు.  
 
రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
''ఈ రోజు చాలా ఆనందాన్ని ఇచ్చిన రోజు. ఎందుకని అంటే.. ఆంధ్రరాష్ట్రానికి సంబంధించి చరిత్రలో గొప్పగా చెప్పుకోదగ్గ రోజు. ముందుగా డాక్టర్స్ డే సందర్బంగా ఆంధ్రరాష్ట్రంలోని వైద్యులతో పాటు అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం 1088 కొత్త ఆంబులెన్స్ లను ప్రారంభించాము. అవి రోడ్డుపై పోతూ వుంటే.. మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి.

విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి వివిధ జిల్లాలకు ప్రయాణమై పోతున్న వాహనాలను చూస్తే ఎంతో సంతోషం కలిగింది. ఇది ఒక రికార్డు. ఇన్ని అధునాతన అంబులెన్స్ లను ఒకేరోజు ప్రారంభించడం, జిల్లాలకు పంపించడం అనేది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే ఘట్టం. పసిపిల్లల ప్రాణాలను కాపాడటం అనేది ప్రభుత్వ బాధ్యత.

ఒక్కోసారి సకాలంలో వైద్య అందక పిల్లలు ప్రాణాపాయంలోకి వెళ్ళడం బాధాకరం. ఈ పరిస్థితి రాకుండా పసిపిల్లల కోసం నియేనేటల్ ఆంబులెన్స్ లను ప్రతి జిల్లాకు రెండు చొప్పున కేటాయించాం. ఇది మనసుకు ఆనందం కలిగించే అంశం.'' అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. 
 
ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను తయారు చేస్తున్నాం
విదేశాల్లో మాదిరిగా రాష్ట్రంలో మొదటిసారి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ భావనను కలగచేయడం, అలాగే ప్రతి పౌరుడి ఆరోగ్యానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్‌ను తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలిపారు. ప్రతి మండలానికి రెండు పిహెచ్‌సి సెంటర్లను నిర్వహిస్తున్నామని, ప్రతి సెంటర్ లోనూ కనీసం ఇద్దరు డాక్టర్లు, ప్రతి మండలానికి కేటాయించిన ఒక 104 వాహనంలో మరో డాక్టర్ వుంటారని అన్నారు.

ప్రతి పిహెచ్‌సికి కనీసం ముప్పై ఊర్లు వుంటాయని అనుకుంటే.. దానిని ఈ రెండు పిహెచ్‌సిలు సమానంగా పంచుకుంటాయని అన్నారు. ఒక డాక్టర్ 104 లో కూర్చుని కనీసంగా 5 నుంచి 7 గ్రామాల బాధ్యత తీసుకుంటారని తెలిపారు. సదరు డాక్టర్ ప్రతినెలా ఖచ్చితంగా ఒకరోజు తన పరిధిలోని గ్రామానికి వెళ్ళి వైద్య సేవలు అందించాల్సి వుంటుందని అన్నారు.

దీనితో ఆ గ్రామాల్లోని రోగుల వైద్యసంబంధ వివరాలను, పరీక్షలను, ఇచ్చిన మందులను  ఎలక్ట్రానిక్ డేటా రికార్డ్‌లో నమోదు చేస్తారని తెలిపారు. విదేశాలలో మాదిరిగా ఫ్యామిలీ డాక్టర్ అనే భావనను ఆయా కుటుంబాలకు కలిగిస్తామని తెలిపారు. 

రాష్ట్రంలో మొట్టమొదటి సారి పౌరుల ఎలక్ట్రానిక్ హెల్త్ డేటాను ప్రభుత్వం నమోదు చేస్తోందని, ఇది ఒక విప్లవాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ తో కూడిన 1.42 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులను ప్రజలకు ఇచ్చామని అన్నారు.

ఈ క్యూఆర్ కోడ్ ఆధారంగా హెల్త్ రికార్డులను చెక్ చేయవచ్చని తెలిపారు. ప్రతి పేషంట్‌కు సంబంధించిన డిజిటల్ ఎలక్ట్రికల్ డేటా తక్షణం అందుబాటులో వుంటుందని అన్నారు. మొదటిసారిగా ఈ రికార్డ్స్‌ను 104, రాబోయే రోజుల్లో వచ్చే విలేజ్ క్లీనిక్, పిహెచ్‌సి లకు అనుసంధానం చేస్తున్నాం. 
 
'గతంకు... నేటికి... మధ్య తేడాను గమనించాలి'
''వైద్యరంగంలో ప్రభుత్వం అందిస్తున్న సేవలకు సంబంధించి ఇంతకు ముందుకు, ఇప్పటికీ తేడా ఏమిటీ అనేది అందరూ గమనించాలి. గతంలో పరిస్థితులు ఎలా వుండేవో ఆలోచించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి చూస్తే... ఎలుకలు కొరికి పిల్లలు చనిపోతున్నారనే కథనాలు పత్రికల్లో వచ్చాయి. సెల్‌ ఫోన్ వెలుగుల్లో ఆపరేషన్లు చేస్తున్నారనే కథనాలు చూశాం. ఇక గతంలో 108, 104 ఎలా వుండేవి అంటే...

పేరుకే 104 వుండేది. ఇక 108 అయితే అరకొరగా ఆంబులెన్స్ లు నడిచే పరిస్థితి. 108 అంబులెన్స్‌ల్లో నడిచే కండిషన్ లో వున్నవి 336 మాత్రమే. అంత దారుణంగా అంబులెన్స్‌లు, ప్రభుత్వ ఆసుపత్రులు వుండేవి. కొద్దోగొప్పో డబ్బు ఖర్చు చేసుకునే స్థితిలో వున్న వారెవ్వరూ ప్రభుత్వ ఆసుపత్రులకు బదులు ప్రైవేటు ఆసుపత్రులకు పోతే బాగుంటుందనే పరిస్థితిని చూశాం"అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు .
 
సకాలంలో 108 అంబులెన్స్ వస్తుందనే నమ్మకం కలిగించాం
రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలిపారు. ఈ రోజు 1088 కొత్త వాహనాలతో ఈ మేరకు శ్రీకారం చుట్టామని అన్నారు. 432 వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్‌లు, 656 కొత్త 104 వాహనాలను సమకూర్చుకున్నామని అన్నారు. 

ఈ అంబులెన్స్ లు సకాలంలో సంఘటనా స్థలంకు చేరకపోతే మనుషుల ప్రాణాలు పోతాయని అన్నారు. అసలు అంబులెన్స్‌లు సకాలంలో వస్తాయో రావో అనే భయం ఉంటే.. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఫోన్ చేస్తే సకాలంలో 108 అంబులెన్స్‌ వస్తుందనే నమ్మకాన్ని కలిగించామని తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20, ఏజెన్సీలో 25 నిమిషాల్లో 108 వాహనం వస్తుందని ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నామని అన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో లైఫ్ సపోర్ట్ వున్న వాహనాలు కేవలం 86 వుంటే... ఇప్పుడు పూర్తిగా ఆ పరిస్థితిని మార్చామని అన్నారు. 432 ఆంబులెన్స్ లో 300 పై చిలుకు బేసిక్ లైఫ్ సపోర్ట్ ఆంబులెన్స్ లు, 104 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు, 26 నియోనేటల్ ఆంబులెన్స్ లను నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ అంబులెన్స్‌ల్లో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశామని అన్నారు. మల్టీప్యార మానిటర్, అత్యాధునిక వెంటిలేటర్లు, నియోనేటల్‌లో మొట్టమొదటిసారిగా ఇంక్యుబేటర్లతో కూడిన వేంటిలేటర్ల వంటి పరికరాలను అమర్చామని తెలిపారు. మొదటిసారిగా అంబులెన్స్ ల్లో కెమేరాలు కనిపిస్తున్నాయని, పేషంట్‌కు 108 వాహనంలో ఎక్కిన వెంటనే రోగి పరిస్థితిని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లో వున్న వైద్యులు ఈ కెమేరా ద్వారా చూసి, అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారని అన్నారు.

అడ్వాన్స్డ్ వెహికిల్ లొకేషన్ సిస్టమ్, టువే కనెస్టివిటీ, జిపిఎస్ వంటి సదుపాయాలు కూడా కల్పించామని అన్నారు. ఇవ్వన్నీ చూస్తుంటే, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్దికి, వ్యవస్థ మీద ప్రజలకు ఒక నమ్మకం కలిగించే పరిస్థితి తీసుకువచ్చామని అన్నారు. 
 
108 సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది జీతాలు పెంచుతూ నిర్ణయం
రాష్ట్రంలో ఒకేసారి 1088 అంబులెన్స్ లను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎయస్ జగన్ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. 108 సర్వీసుల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలను పెంచుతూ ఈ సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి తీపి కబురు అందించారు.  గతంలో 108 వాహనం డ్రైవర్లకు రూ.10వేలు జీతం ఇస్తే... ఈరోజు వారి సర్వీసును బట్టి ఆ జీతాలను రూ.18వేల  నుంచి 28వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్‌కు గతంలో రూ.12 వేలు ఇస్తుంటే... దానిని వారి సర్వీసును బట్టి రూ.20వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా ఈ రోజు నుంచే అమలులోకి వస్తుందని ముఖ్యమంత్రి  వైయస్ జగన్ ప్రకటించారు.  
 
మాటలతోనే కాదు.. చేతలతో మార్పు చూపించాను: సీఎం
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులను మాటల్లోనే కాదు.. దేవుడి దయతో.. మీ అందరి చల్లని దీవెనతో చేతల్లోనే చూపించానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ  ఆసుపత్రుల్లో  జాతీయ ప్రమాణాలు వుండేలా తీర్చి దిద్దుతున్నామని గర్వంగా చెబుతున్నానని అన్నారు.

విలేజ్ క్లీనిక్స్, పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో జాతీయ ప్రమాణాలు వుండేలా పూర్తిగా వాటి రూపురేఖలు మారుస్తున్నామని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత నేటికి రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు వుంటే.. వాటికి అదనంగా మరో 16 టీచింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఈ ఆగస్టు 15న వాటికి సంబంధించిన టెండర్లు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంకు ఒక టీచింగ్, నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఐటిడిఎ పరిధిలో ఏడు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించబోతున్నాం. అలాగే  క్యాన్సర్, కిడ్నీ స్పెషాలిటీ ఆసుపత్రలను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. 
 
ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ వైద్యం
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం రూపురేఖలను పూర్తిగా మార్చే కార్యక్రమం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలిపారు. గతంలో నెట్ వర్క్ ఆసుపత్రికి పోతే... ఆ పేషంట్ ను ముట్టుకోవాలంటే అక్కడి సిబ్బంది భయపడేవారని అన్నారు. వైద్యం అందించిన ఆసుపత్రులకు కనీసం ఎనిమిది నెలల పాటు బిల్లులు బకాయి వున్నాయని అన్నారు.

ఆ బకాయిలను కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని, వైద్యం అందించిన మూడు వారాల్లో బిల్లుల చెల్లింపులు జరుపుతున్నామని తెలిపారు. దీనివల్ల ఆరోగ్యశ్రీ కార్డుతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తులకు అక్కడ సిబ్బంది చిరునవ్వుతో వైద్యం అందిస్తున్నారని అన్నారు. 

పేదవాడికి వైద్యం ఎలా అందించాలన్న ఆరాటంతో ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయడంతో పాటు ఆ తరువాత కావాల్సిన రెస్ట్ పీరియడ్ లో ఆరోగ్య ఆసరా కింద  నెలకు అయిదు వేలు చొప్పున ప్రభుత్వం నుంచి చెల్లిస్తున్నామని తెలిపారు. ఈనెల 8వ తేదీన ఆరు జిల్లాలలో 2059 ప్రోసీజర్లను ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించే కార్యక్రమం చేపడుతున్నామని, నవంబర్ 14 నాటికి దీనిని అన్ని జిల్లాలకు విస్తరింప చేస్తామని తెలిపారు.

అలాగే వెయ్యి రూపాయలు వైద్యం ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యఖర్చులు చెల్లిస్తున్నామని, పక్కరాష్ట్రాల్లోని 130 ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు.