శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 జులై 2024 (09:53 IST)

సీఎం చంద్రబాబు పేషీలోకి మరో కీలక ఐఏఎస్ అధికారి!

babu cbn
ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పునకు అనుగుణంగా సుపరిపాలన అందించేందుకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఐఏఎస్ అధికారులను ఏరికోరి నియమించుకుంటున్నారు. 
 
ముఖ్యంగా సీఎం చంద్రబాబు పేషీలోకి మరో కీలక ఐఏఎస్ అధికారి రాబోతున్నారు. యూపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఏవీ రాజమౌళి సోమవారం సీఎంవోలో రిపోర్టు చేయనున్నారు. ఆయన డిప్యుటేషన్‌కు అపాయింట్‌మెంట్స్ కమిటీ ఇప్పటికే సమ్మతం తెలిపింది.
 
రాబోయే మూడేళ్లపాటు ఆయన ఏపీలో పని చేసేందుకు అనుమతి ఇచ్చింది. 2003 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాజమౌళి... గత టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో డిప్యూటేషన్‌పై పని చేశారు. 
 
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉండే సీఎంవో కీలక బాధ్యతలను ఆయన నిర్వహించారు. ఇపుడు కూడా ఆయన సీఎంవోలోనే విధులు నిర్వహించనున్నారు. ఆయన రాకతో సీఎంవో కీలక అధికారుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రస్తుతం సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర, సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్న, అనదుపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా విధులు నిర్వహిస్తున్నారు. ఇపుడు నాలుగో అధికారిగా రాజమౌళి విధుల్లో చేరనున్నారు. 
 
ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినతి మేరకు ఏపీకి ఐఏఎస్ అధికారి కృష్ణతేజ కూడా ఏపీకి రానున్నారు. ఆయన్ను రిలీవ్చ చేసేందుకు కేరళ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగా కేంద్రం కూడా పచ్చజెండా ఊపింది. 
 
ఈ మేరకు సోమవారం అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదముద్రవేయనుంది. దీంతో ఆయన వచ్చే బుధ లేదా గురువారాల్లో ఏపీలో రిపోర్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈయన పవన్ కళ్యాణ్ చేపట్టిన శాఖల్లో కీలక అధికారిగా కొనసాగే అవకాశం ఉంది.