ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జులై 2020 (08:41 IST)

జిల్లా కోవిడ్ కేర్ సెంటర్లలో కనీసం 5వేల బెడ్‌లు: ఏపీ కోవిడ్ టాస్క్‌ఫోర్స్

ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్వారంటైన్, కోవిడ్ కేర్ సెంటర్లలో సదుపాయాలను మరింత పటిష్టపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు.

మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ ప్రభావాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించడం, పాజిటీవ్ పేషంట్లు, అనుమానిత లక్షణాలు వున్న వారికి మెరుగైన సేవలను అందించే అంశాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారని తెలిపారు.

ఈ మేరకు అధికారయంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు ఇచ్చారని అన్నారు. క్వాంరంటైన్, కోవిడ్ కేర్ సెంటర్ల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా జాయింట్ కలెక్టర్ (డెవలప్‌మెంట్)కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుందని తెలిపారు. 
 
సదుపాయాలపై థర్డ్‌పార్టీతో సర్వే
క్వారంటైన్, కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రులపై ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం  థర్డ్‌పార్టీతో సర్వే నిర్వహించిందని కృష్ణబాబు తెలిపారు. ఈ సర్వేలో కొన్నిసెంటర్లలో సదుపాయాల కల్పన పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం వెల్లడయ్యిందని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్‌ (డెవలప్‌మెంట్) లకు ఈ సెంటర్ల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించామని వెల్లడించారు.

ఈ సెంటర్లలో పేషంట్లు, అనుమానితులకు అందిస్తున్న ఆహారం, శానిటేషన్, వైద్యబృందాలు అందిస్తున్న సేవలు, సమయానికి అనుగుణంగా అందుబాటులో వుండటం, ప్రభుత్వం ప్రకటించిన మెనూను సక్రమంగా అమలు చేస్తున్నారా,  మెడికల్ టీంలు సరిగ్గా పనిచేస్తున్నాయా, అంబులెన్స్‌ల సంసిద్దత తదితర అంశాలను జెసిలు పరిశీలిస్తారని తెలిపారు.

ఎప్పటికప్పుడు జిల్లా నోడల్ ఆఫీసర్లతో వీరు సమన్వయం చేసుకుంటూ, ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు వుంటే, దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే కొందరికి మెమోలు కూడా ఇస్తున్నామని, మరోసారి థర్డ్‌పార్టీతో రెండోవిడత సర్వే చేయించబోతున్నామని తెలిపారు.

అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కోవిడ్, క్యారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై పాజిటీవ్ వ్యక్తులు, అనునిత లక్షణాలు వున్న వారి నుంచి రాష్ట్ర కోవిడ్ కంట్రోల్ రూం ద్వారా ప్రతిసెంటర్ నుంచి పదిమంది అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు.

అలాగే రోజువిడిచి రోజు ఐవిఆర్‌ఎస్‌తో కూడా సమాచారంను సేకరిస్తామని వెల్లడించారు. ఈ ఫీడ్ బ్యాక్ ద్వారా ఆయా సెంటర్లను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
ఈనెల 15లోగా అన్ని పెండింగ్ బిల్లుల చెల్లింపు
కొన్ని కోవిడ్ సెంటర్‌లలో బిల్లలు పెండింగ్‌లో వున్న విషయం ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్ దృష్టికి వచ్చిందని, జూన్ 30వ తేదీ వరకు వున్న బిల్లులను వెంటనే ఈ నెల పదిహేనో తేదీలోగా చెల్లించాని సీఎం ఆదేశించినట్లు కృష్ణబాబు తెలిపారు. కొన్నిచోట్ల అడ్మినిస్ట్రేటీవ్ కారణాల వల్ల బిల్లులు పెండింగ్ లో వున్నట్లు గుర్తించామని అన్నారు. వాటిని కూడా నిబంధనల ప్రకారం వెంటనే సిద్దం చేసి క్లియరెన్స్‌కు పంపాలని ఆదేశించినట్లు తెలిపారు.

దీనిపై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అన్ని జిల్లాలకు ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. అలాగే సెంటర్లలో అందిస్తున్న ఆహారం కూడా నాణ్యతతో వుండాలని, ప్యాకింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ప్యాకింగ్ కోసం ఐఆర్‌సిటిసి సహాయం తీసుకుంటామని తెలిపారు.

ఆహారానికి సంబంధించి ఇప్పటికే ప్రతి సెంటర్ నుంచి ఫోటోలను తెప్పించి, వాటిని పరిశీలించామని అన్నారు. ఈ సెంటర్లలో రోజుకు ఒక వ్యక్తికి రూ.500 ఆహారం, ఇతర సదుపాయాల కోసం ఖర్చు చేస్తున్నామని, ఇంతపెద్ద మొత్తం ఇలా ఇవ్వడం రాష్ట్రంలోనే మొదటిసారి అని అన్నారు .
 
త్వరలో ప్రతిజిల్లాలోనూ 5వేల కోవిడ్ కేర్ సెంటర్ బెడ్లు
కోవిడ్ లక్షణాలు వున్న వారిని, అనుమానిత లక్షణాలు వున్నవారిని కోవిడ్ ఆసుపత్రుల్లో చేర్చడం కష్టం కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్లలో వారిని వుంచి, ఎప్పటికప్పుడు వారిని పరిశీలించడం, ఎవరికైనా లక్షణాలు బయటపడి అస్వస్తతకు గురయ్యే పరిస్థితి వుంటే, వెంటనే వారిని సమీపంలోని కోవిడ్ ఆసుపత్రికి తీసుకువెళ్ళేందుకు వీలుగా అన్ని ఏర్పాటు చేసినట్లు కృష్ణబాబు తెలిపారు.

అందుకే కోవిడ్ ఆసుప్రతికి కనీసం పదిహను నిమిషాల ప్రయాణ దూరంలోనే కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తన్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 76 కోవిడ్ కోవిడ్ సెంటర్లలో మొత్తం 45240 బెడ్ లను సిద్దం చేయడం జరిగిందని కృష్ణబాబు తెలిపారు. ప్రతిజిల్లాలో కనీసం మూడు వేల కోవిడ్ కేర్ సెంటర్ బెడ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని త్వరలోనే 5వేల బెడ్ లకు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ప్రతి జిల్లాకు కోటి రూపాయలు ప్రత్యేక నిధులు ఇవ్వడ జరిగిందని తెలిపారు. ప్రతి కోవిడ్ సెంటర్ కు ఒక మొబైల్ ఎక్స్‌రే, ఇసిజి, ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 23 యాక్టీవ్ సెంటర్లలో 2280 మంది  అడ్మిట్ అయ్యారని తెలిపారు.

ఈ రోజు 230 మంది అడ్మిట్ అయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 74 కోవిడ్ హాస్పటల్స్ లో 5874 మంది చికిత్స పొందుతున్నారని, 9421 మంది అనుమానితులు 116 క్వారంటైన్ సెంటర్లలో వున్నారని తెలిపారు. క్వాంరంటైన్, కోవిడ్ కేర్ సెంటర్లలో మంచినీరు, ఆహారం, శానిటేషన్, వైద్యబృందాలు అందించే సేవలు, అంబులెన్స్‌లు తదితర అన్ని సదుపాయాల విషయంలో ఎటువంటి ఉదాసీనత ప్రదర్శించినా సహించేది లేదని స్పష్టం చేశారు. 
 
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పరీక్షలు
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా పదిశాతం మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని కృష్ణబాబు తెలిపారు. వారికి ఇస్తున్న క్యూఆర్‌ కోడ్ సహాయంతో వెబ్‌సైట్‌లో వారి సమాచారంను పొందపరిచి, గ్రామ, వార్డు సచివాలయాలకు దానిని పంపి, వారు హోంక్వారంటైన్‌లో సక్రమంగా వుంటున్నారో లేదో పరిశీలించాని ఆదేశించినట్లు కృష్ణబాబు తెలిపారు.

అలాగే వారి ఆరోగ్య పరిస్థితిని కూడా స్థానికంగా వుండే ఎఎన్ఎం, ఆశావర్కర్లు, ఆరోగ్యకార్తకర్తలు పరిశీలిస్తారని తెలిపారు. రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్ట్‌లు, రోడ్డుమార్గంలో వచ్చే వారిని కూడా పరీక్షించిన తరవాతే అనుమతిస్తున్నామని అన్నారు. ప్రతిరోజూ 4600 మంది వరకు రాష్ట్రంలోకి వస్తున్నారని తెలిపారు. 

రాష్ట్రానికి రోజూ 22 రైళ్లు వస్తున్నాయని, వాటిద్వారా రోజుకు సుమారు ఏడు వేల మంది వరకు వస్తున్నారని తెలిపారు. ఎయిర్ట్ పోర్ట్‌ల ద్వారా రోజుకు సుమారు 1500 మంది వరకు వస్తున్నారని తెలిపారు. సగటున 15వేల మంది వరకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని తెలిపారు. ఆరు రాష్ట్రాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించామని తెలిపారు. అలాగే అంతర్జాతీయ ప్రయాణీకులు సుమారు 13వేల మంది వచ్చారని తెలిపారు.

చార్టెర్డ్ ఫ్లయిట్స్ కు కేంద్రం అనుమతి ఇవ్వడం వల్ల రోజుకు నాలుగు చార్టెడ్ విమానాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. దీనిలో రోజుకు సుమారు ఆరువందల మంది రాష్ట్రంలోకి వస్తున్నారని తెలిపారు.

తిరుపతి ఎయిర్‌పోర్ట్ కు అంతర్జాతీయ సర్వీసుల అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, త్వరగా అది అందుబాటులోకి వస్తే గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన వారిని నేరుగా తిరుపతి ఎయిర్‌ పోర్ట్ కు తీసుకురావచ్చని అన్నారు.