బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 26 మే 2020 (23:46 IST)

టీటీడీ ఆస్తులపై ఆడిట్ జరపాలి: రమణ దీక్షితులు

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై ఆడిట్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు టీటీడీ ఆస్తులు, ఆభరణాల ఆదాయం, ఖర్చులపై జాతీయ స్ధాయిలో ఆడిట్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇందుకు సంబంధించి తన డిమాండ్లను బీజేపీ నేత సుబ్రమణ్యస్వామికి ట్వీట్ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఆస్తుల వేలం ప్రక్రియపై రాజకీయంగా దుమారం లేచిన సమయంలో రమణ దీక్షితులు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కాగా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి అప్పట్లో సంచలనానికి తెర తీశారు రమణ దీక్షితులు. టీటీడీ లోని అక్రమాల్లో టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. వైసీపీ అప్పట్లో అతనికి మద్దతు పలికింది కూడా.

దీనితో ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రమణ దీక్షితులు తిరిగి బాధ్యతలు స్వీకరిస్తారని భావించారంతా. ఎన్నికలకు ముందు జగన్ ను హైదరాబాద్ లో రమణ దీక్షితులు కలిసాడు. 
 
ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి వచ్చినప్పుడు జగన్ ను కలుసుకొని పట్టు వస్త్రం కప్పి సత్కరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రమణ దీక్షితులు ఇక మరోమారు ఆలయంలోకి వచ్చినట్టే అని అంతా అనుకున్నారు. టీటీడీ కొత్త పాలక మండలి తొలి సమావేశంలోనే దీనికి సంబంధించిన తీర్మానం చేస్తారనే వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. 

కాకపోతే పాలక మండలి రెండు సమావేశాలు నిర్వహించినా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. వారం రోజుల కింద అర్చకుల వారసత్వ హక్కులను సమర్థిస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటన చూసినవారంతా రమణ దీక్షితులుకు లైన్ క్లియర్ అయ్యిందనుకున్నారు. అర్చకులకు రిటైర్మెంట్ ఉండదని ప్రభుత్వం ప్రకటించింది.

కాకపోతే ప్రభుత్వం ఈ ప్రకటనలో చిన్న మెలిక పెట్టింది. టీటీడీ మినహా మిగితా అన్ని ఆలయాలకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనితో మరోసారి నిరాశకు గురవ్వాల్సి వచ్చింది రమణ దీక్షితులు.