1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:05 IST)

అవనిగడ్డలో కూలిన ఆంజనేయ ఆలయం! కాలువలో పడిన విగ్రహం..!

కృష్ణాజిల్లా దివిసీమలోని అవనిగడ్డలో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం మంగళవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కాలువలో పడి ధ్వంసమైంది. ఈ ప్రమాద కారణంగా భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
కృష్ణా జిల్లా అవనిగడ్డలో కేఈబీ కెనాల్ ఆధునీకరణ పనుల్లో భాగంగా వంతెన సెంటర్‌లో కాల్వ పనులు జరుగుతున్నాయి. కాల్వకు ఆనుకునే ఆంజనేయస్వామి ఆలయం ఉంది. పక్కనే 18 అడుగుల లోతున గోయి తవ్వారు. దీనిని ఎవరూ గమనించలేదు. తాగు నీటి కోసం కేఈబీ కెనాల్‌కు సోమవారం నీటిని విడుదల చేశారు. నీరు ఆలయం కింద చేరి నాని మట్టి కొట్టుకుపోయింది. ఆంజనేయస్వామి ఆలయం కాల్వలోకి కుప్పకూలింది.
 
ఈ ఘటనలో స్వామి విగ్రహం కూడా పూర్తిగా శిధిలమైంది. ఈ ఘటనతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు రాస్తారోకోకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి కాంట్రాక్టర్ అంగీకరించడంతో స్థానికులు తమ ఆందోళన విరమించారు.