శుక్రవారం, 27 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (08:04 IST)

సీనియర్లంటే ఆయనకు లెక్కలేదు.. పదవులు కాదు.. విలువలు ముఖ్యం : బాలినేని (Video)

balineni - pawan
పార్టీలోని సీనియర్లన్నా.. వారు ఇచ్చే సూచనలన్నా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం లక్కేలేదని ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. బాలినేనితో పాటు పలువురు వైకాపా నేతలు గురువారం జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడారు. 
 
తాను మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేశానని, తాను జనసేన పార్టీలో చేరడం వల్ల ఒంగోలులో కూటమికి ఇబ్బంది రాదని స్పష్టం చేశారు. ఇటీవల చిన్న చిన్న వివాదాలు వచ్చాయని, అవన్నీ సర్దుకుంటాయన్నారు. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని బాలినేని పేర్కొన్నారు.
 
అదేసమయంలో వైఎస్ జగన్ తీరుపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. 'జగన్మోహన్ రెడ్డికి మాలాంటి సీనియర్ నేతలంటే అసలు లెక్క లేదు. నేను వైయస్సార్‌కు వీరాభిమానిని. ఆయన అడుగుజాడల్లో పని చేశాను. జగన్మోహన్ రెడ్డి ఏక పక్ష నిర్ణయాలు మా మనసుకు కష్టం కలిగించాయి. నాకు పదవులు ముఖ్యం కాదు. విలువ, గౌరవం ముఖ్యం. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం నేను పని చేస్తా. 
 
రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో అందరనీ మారుస్తాం అన్నారు. మాలాంటి కొంతమందిని మార్చి మమ్మల్ని అవమానించారు. మంత్రి పదవుల్లో కొనసాగించిన వాళ్లు అంత గొప్పగా ఏం చేశారో.. మేమేం చేయలేదో జగన్‌కే తెలియాలి. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు చాలా సందర్భాలలో నన్ను బాధించాయి. అవన్నీ గతం.. ఇప్పుడు మా అధినేత పవన్ కల్యాణ్. నా పార్టీ జనసేన. నాకు జనసేనలో అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు. పార్టీ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా' అని బాలినేని చెప్పుకొచ్చారు.