శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (11:54 IST)

నా చెల్లితో మాట్లాడుతావా? కిడ్నాప్ చేసి... గుండు కొట్టి..?

ఓ యువకుడు తన చెల్లితో మాట్లాడుతున్నాడన్న కోపంతో అతడిని కిడ్నాప్ చేసి, గుండుకొట్టించి దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
పోలీసుల కథనం మేరకు బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఫస్ట్‌లాన్సర్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ మన్సూర్ అలీఖాన్ అలియాస్ నసీర్(19) అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతితో స్నేహంగా ఉంటున్నాడు. వీరిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారనే విషయం తెలుసుకున్న సదరు యువతి సోదరుడు ఇబ్రహీంఖాన్ సోమవారం మధ్యాహ్నం మన్సూర్‌కు ఫోన్ చేశాడు.
 
మన్సూర్‌తో మాట్లాడాలని అతడిని జీవీకే మాల్ వద్దకు పిలిపించాడు. మన్సూర్ అక్కడకు చేరుకోగానే అతడిని కారులో ఎక్కాల్సిందిగా కోరారు. దానికి అతడు నిరాకరించడంతో బలవంతంగా కారులోకి ఎక్కించి సైదాబాద్ సమీపంలోని అక్బర్‌బాగ్‌కు తీసుకువెళ్లారు. అక్కడున్న ఓ హెయిర్ సెలూన్‌లో బలవంతంగా తలపై జుట్టును తొలగించారు. అక్కడి నుంచి మళ్లీ కారులో కొడుతూ ఆ చిత్రాలను సెల్‌ఫోన్‌తో చిత్రీకరించారు. 
 
ఆ తర్వాత మన్సూర్ వద్ద ఉన్న రూ.5వేలను లాక్కొని రాత్రి 7.45 గంటల ప్రాంతంలో అరాంఘర్ చౌరస్తా వద్ద వదిలేశారు. ఇంకోసారి తన చెల్లితో మాట్లాడితే ప్రాణాలు తీస్తామంటూ బెదిరించారు. ఈ ఘటనలో గాయాలపాలైన మన్సూర్ సోమవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితుడు ఇబ్రహీంఖాన్‌తో పాటు అతడి స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.