శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (13:45 IST)

బిడ్డా... కొడాలి నానీ ఖబడ్డార్... భజరంగ్ దళ్ హెచ్చరిక

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల డిక్లరేషన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిని భజరంగ్ దళ్ హెచ్చరించింది. బిడ్డా.. కొడాలి నాని ఖబడ్దార్ అంటూ హెచ్చరిక చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న నానిని మంత్రిపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 
 
బుధవారం హైదరాబాద్‌లోని‌ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం లోటస్ పాండ్‌ ముట్టడికి భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

హిందువులంటే నమ్మకంలేని మంత్రి కొడాలి నాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని భజరంగ్ దళ్ కార్యకర్తలు మండిపడ్డారు. హనుమంతుని చెయ్యేకదా విరిగింది.. నష్టమేంటని అంటున్నారని, మంత్రికి సిగ్గులేదా? మానవత్వం లేదా? అని ప్రశ్నించారు. అమ్మవారి రధం సింహాలు మాయమైతే.. అది వెండేకదా అని వెటకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్దారు. 
 
ఆ సింహాల్లో తాము వెండిని చూడలేదని, భగవంతుని, శక్తిస్వరూపిణిని అమ్మవారిని చూస్తున్నామని అన్నారు. అంతర్వేది రథం దగ్ధం అయితే రూ.కోటి ఇస్తున్నామని అంటున్నారని, ఎవరి డబ్బులు ఇస్తున్నారని వారు ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్ అవసరంలేదని చెబుతారని, బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఆనవాయితీనే కాదంటున్నారని, హిందువుల మనోభావాలను గౌరవించాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు కొడాలి నానికి సూచించారు.
 
అలాగే, టీడీపీ మహిళా నేత అనిత కూడా మంత్రి కొడాలి నానిని హెచ్చరించింది. వెంకటేశ్వరస్వామి జోలికి పోవద్దని సీఎం జగన్‌ను ఆమె హెచ్చరించింది. డిక్లరేషన్‌ ఇచ్చాకే జగన్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. 
 
డిక్లరేషన్‌ ఇవ్వాలనే నిబంధన 1860 నుంచి ఉందన్నారు. బ్రిటిష్‌వారు సైతం ఈ విధానాన్ని అనుసరించారని చెప్పారు. మంత్రి జయరాం బెంజ్‌ కారు వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకే మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. హిందూ ధర్మాలపై గౌరవంలేని మంత్రి కొడాలి నాని పేరు మార్చుకోవాలన్నారు. 
 
అలాగే, పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, మంత్రి కొడాలి నానీ భ్రమల నుంచి బయటికి రావాలని హెచ్చరించారు. గతంలో ఓ పార్టీలో ఉండేవారని, ప్రస్తుతం మరో పార్టీలో ఉన్నారని, త్వరలో కొడాలి నానికి ఈ పార్టీపై ఉన్న భ్రమలు కూడా తొలిగిపోయి, ఇతర పార్టీలోకి వెళ్తారని స్వామీజీ ఎద్దేవా చేశారు. 
 
తిరుపతి ఎవడబ్బ సొత్తు అనడం చాలా దారుణమైన అంశమని, తిరుమల డిక్లరేషన్ పై ప్రశ్నించడం అహంకారమే అవుతుందని అన్నారు. దేవుళ్ల గురించి మాట్లాడే స్థాయి నానికి లేదని మండిపడ్డారు. తిరుమల కొండతో పెట్టుకున్న వారి బూడిద కూడ దొరకలేదని, ఆ చరిత్ర కూడా కళ్లముందే ఉందని పేర్కొన్నారు. దేవుళ్లతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతారని హెచ్చరించారు.