బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (16:50 IST)

తిరుమల దర్శనం, అన్యమతస్తుల డిక్లరేషన్ పైన కొడాలి నాని వ్యాఖ్యలు, భగ్గుమంటున్న సంఘాలు

అసలే ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే హిందువులు రగిలిపోతున్నారు. దాడులు చేస్తున్న వారిని గుర్తించాలి. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మంత్రి నాని తిరుమల డిక్లరేషన్ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు మరింత రాజుకున్నాయి.
 
తిరుమలకు వచ్చే అన్యమతస్తులు సంతకం చేయాల్సిన అవసరం లేదంటూ టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పడం.. అలా తను మాట్లాడలేదని.. ఎవరైనా సంతకం పెట్టాల్సిందేనంటూ సుబ్బారెడ్డి చెప్పి తప్పించుకున్నారు. ఇంతలోనే తిరుమల డిక్లరేషన్ వ్యవహారం తెరపైకి వచ్చింది.
 
గతంలో ముఖ్యమంత్రిగా తిరుమల శ్రీవారికి ఎన్నోసార్లు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. అయితే ఆయన ఎప్పుడు డిక్లరేషన్ పైన సంతకం పెట్టలేదు. ప్రస్తుతం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదంటూ టిటిడి ఛైర్మన్ చెప్పారు.
 
మంత్రి కొడాలి నాని కూడా ఏ ఆలయంలో డిక్లరేషన్ లేదు తిరుమలలో డిక్లరేషన్ పైన చర్చ జరగాలంటూ వ్యాఖ్యలు చేయడం ఇది కాస్త పెద్ద రచ్చకే కారణమవుతోంది. అంతే కాదు టిటిడి ఛైర్మన్ పదవికి వై.వి.సుబ్బారెడ్డి అనర్హుడంటూ హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే వైసిపి కూలిపోతుందంటూ హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనిపై మంత్రి కొడాలి నాని, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డిలు మాత్రం నోరు మెదపడం లేదు.