మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 7 అక్టోబరు 2021 (16:50 IST)

విజయవాడలో భారత స్కౌట్లు, గైడ్స్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం

మూగజీవాల రక్షణ, పర్యావరణ సమతౌల్యత పట్ల స్కౌట్లు, గైడ్లు ప్రత్యేక బాధ్యత వహించాలని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ పి సిసోడియా వివరించారు. మానవాళికి ఏవిధంగానూ అపకారం చేయని జంతుజాలానికి పత్యక్షంగానో, పరోక్షంగానో మనం కీడు తలపెడుతున్నామ‌ని  ఆవేదన వ్యక్తం చేసారు. భారత స్కౌట్లు, గైడ్లు ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర మండలి సమావేశం నగరంలోని ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ ఆవరణలో గురువారం జరిగింది. నూతన పాలక వర్గం ప్ర‌మాణ స్వీకారం చేయగా, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తరుపున డాక్టర్ సిసోడియా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్లు, గైడ్లు నియమావళిలో మూగ జీవాల సంరక్షణను ఒక అంశంగా చేర్చాలన్నారు. ఎన్ ఎస్ ఎస్, ఎన్ సిసి లతో పాటు స్కౌట్లు, గైడ్లు విధానాన్ని ఉన్నత విద్యారంగంలో కూడా అమలు చేయవలసి ఉందని స్పష్టం చేసారు. 
 
 
కరోనా కాలంలో స్కౌట్లు, గైడ్లు అందించిన సేవలు నిరుపమానమన్న సిసోడియా, ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ సేవలను మరింత విస్తరించవలసి ఉందన్నారు. భారత స్కౌట్లు, గైడ్లు ఆంధ్రప్రదేశ్ శాఖ ఛీప్ కమీషనర్, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చిన వీరభధ్రుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారత స్కౌట్లు, గైడ్లు సంస్ధకు విలువైన ఆస్తులు ఉన్నాయని వాటి సంరక్షణ విషయంలో స్పష్టమైన చర్యలు తీసుకోవలసి ఉందన్నారు. క్రమశిక్షణతో కూడిన స్కౌట్లు, గైడ్లు శిక్షణ ఫలితంగా విద్యార్ధులు సన్మార్గంలో పయనిస్తారని అన్నారు. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వట్రిసెల్వి మాట్లాడుతూ, స్కౌట్లు, గైడ్ల ఆదర్శనీయమైన ప్రవర్తన సమాజానికి మార్గదర్శి కావాలన్నారు. కాలానుగుణంగా విధివిధానాల మార్పు అత్యావశ్యకమన్నారు.

 
ఆయుష్ కమీషనర్ కల్నల్ రాములు మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా ఈ విభాగం అందిస్తున్న సేవలు ఎంచదగినవన్నారు. సంస్ధ కార్యదర్శి వేణుధర్ మాట్లాడుతూ, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, వట్రిసెల్వీ నూతన ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారన్నారు. మరోవైపు ట్రైనింగ్ కమీషనర్లుగా ఆరుగురిని నియమించుకున్నామని, పరిధిని విస్రృత పరిచి మరింత మందికి స్కౌట్లు, గైడ్లు శిక్షణ అందించేలా ప్రయత్నిస్తామన్నారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ సంయిక్త కార్యదర్శి ప్రతాప రెడ్డి, స్కౌట్లు, గైడ్లు కృష్ణా జిల్లా అధికారి శాహిరా సుల్తానా, శ్రీనివాసరావు, భవానీ, పార్వతి, బిఆర్కె శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరగా జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పలు నూతన తీర్మానాలు ఆమోదించారు.