గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 12 ఏప్రియల్ 2021 (16:44 IST)

భవానీపురం: హోంగార్డు బెదిరించబోయాడు, తుపాకీ తూటా భార్య గుండెల్లోకి దూసుకెళ్లింది

విజయవాడలోని గొల్లపూడిలో తుపాకీ మిస్‌ఫైర్‌ అయిన ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో హోంగార్డే భార్యపై కాల్పులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగంలోని ఓ ఏఎస్పీ వద్ద హోంగార్డు వినోద్‌కుమార్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.
 
మూడు రోజుల క్రితం ఏఎస్పీ అనంతపురం వెళ్లారు. ఆ సమయంలో ఏఎస్పీ తుపాకీని హోంగార్డు వద్ద ఉంచారు. దాన్ని హోంగార్డు ఇంటికి తీసుకువచ్చాడు. మొదట ఇంట్లో తుపాకీ మిస్‌ఫైర్‌ అయినట్లు హోంగార్డు చెప్పాడు. బుల్లెట్‌.. అతడి భార్య సూర్యరత్నప్రభ గుండెల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
 
ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే భార్యను బెదిరించే క్రమంలోనే ఆ తుపాకీతో హోంగార్డు కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
 
బంగారు నగలు తాకట్టు పెట్టిన విషయంలో గత అర్థరాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని పశ్చిమ మండల ఏసీపీ హనుమంతరావు తెలిపారు.