ప్రతి అమావాస్యకు మాపై కేసులు: దేవినేని
తిరుపతి: రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆక్షేపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అమావాస్యకు తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తనపై సీఐడీ కేసు ఎందుకు పెట్టారని ఉమ ప్రశ్నించారు.
తిరుపతిపై సీఎం అంతరంగాన్ని మీడియాకు చూపితే నాపై కేసులా? మార్ఫింగ్ చేశానని తప్పుడు కేసులు బనాయిస్తారా? రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారా? తప్పుడు కేసులు పెడితే భయపడేది లేదు. మాజీ మంత్రి వివేకాది గుండెపోటు అని చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు పెట్టాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జలాలను రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిందని.. దీనిపై రాష్ట్ర హక్కులను వదిలేశారని దేవినేని ఉమ ఆరోపించారు. కృష్ణా బోర్డు పరిధిలో లేని ప్రాజెక్టులను దాని పరిధిలోకి తెచ్చారని విమర్శించారు.