శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జూన్ 2024 (09:49 IST)

వైకాపా నేతలతో అంటకాగి.. ఒత్తిడికి తలొగ్గి రాజీనామాలు.. రెంటికీ చెడ్డ రేవడిగా వలంటీర్లు!!

ఏపీలో గత ప్రభుత్వ పెద్దలు, నేతలు, ఎమ్మెల్యేలు చెప్పారనో, ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారనో రాజీనామా చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఉన్నదాంతో పాటు రాబోతున్న అదనపు ఆర్థిక ప్రయోజనాలూ కోల్పోతున్నామని వారు బోరున విలపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది వాలంటీర్లతో వైకాపా నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 6,398, పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యల్పంగా 515 మంది ఉన్నారు.
 
ఆ తర్వాత వలంటీర్లతో తమ పార్టీ ఎన్నికల ప్రచారం పనులు చేయించుకున్నారు. అయితే, గత ప్రభుత్వ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఒత్తిళ్లతో వీరు వాలంటీరు ఉద్యోగాలను వదులుకున్నారు. వీరిలో చాలామంది ప్రచారంలో వైకాపా అభ్యర్థులకు అండగా నిలబడ్డారు. ఓటర్లకు తాయిలాల పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. తీరా, ఎన్నికల ఫలితాల తర్వాత వైకాప చిత్తు చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 
 
దీంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తమ భవిష్యత్తేంటని ప్రశ్నిద్దామన్నా, వైకాపా నేతలు ముఖం చాటేస్తున్నారని వాపోతున్నారు. ఒత్తిళ్లకు తలొగ్గక కొనసాగిన వారంతా మంచి రోజులు రాబోతున్నాయని ఆశిస్తున్నారు. వాలంటీర్ల పారితోషికం రెట్టింపు చేస్తామన్న చంద్రబాబు హామీ వారిని ఊరిస్తోంది.